తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ద్వంద్వ ప్రమాణాలు మరోసారి బయటపడ్డాయి. ఒక వైపు చంద్రబాబుకు ఆరోగ్యం సరిగా లేదని, విశ్రాంతి అవసరమని చెబుతూనే, పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆయన వెంట ఒక ప్రత్యేక అంబులెన్స్ పెట్టాలని ఆయన డాక్టర్లు చేసిన సిఫారస్ కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే నిజంగా ఆరోగ్యం బాగోకపోతే విశ్రాంతి కాకుండా రాజకీయ యాత్రలకు డాక్టర్‌లు ఎలా ఆమోదం తెలుపుతారో తెలియదు. ఇది ఒక కోణం అయితే.. కోట్ల రూపాయల మొత్తాన్ని నగదు రూపంలో టీడీపీ ఖాతాలో వేసిన తీరు ఆ పార్టీ అవినీతి మూలాలను వెలుగులోకి తెచ్చింది.
✍️గతంలో నోట్ల రద్దును స్వాగతించడం, అప్పట్లో ఒక ప్రత్యేక సంస్థ ఆద్వర్యంలో అర్ధ క్రాంతి పేరుతో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి లెక్చర్లు ఇచ్చిన తీరు గుర్తుకు చేసుకుంటే ఈ పార్టీ డబుల్ స్టాండర్స్ ఎంత ఘోరంగా ఉంటాయో తెలియచేస్తాయి. దీనికి ఈనాడు రామోజీరావు కూడా బాండ్ కొడుతుండేవారు. కాని ఇప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ఖాతాలోకి స్కిల్ స్కామ్ నిధులు ఇరవై ఏడు కోట్లు అక్రమంగా వెళితే , దానిని ఖండించకపోగా, ఆ అవినీతిని రామోజీ దారుణంగా సమర్ధిస్తున్నారు. ఇతర స్కామ్‌ల నిధులు కూడా కొంత అదే ఖాతాలోకి వెళ్లాయని సీఐడీ అభియోగం. మొత్తం అరవై ఐదు కోట్ల వరకు డబ్బు ఎలా చేరిందన్నదానికి లెక్కలు ఇవ్వడానికి టీడీపీ వెనుకాడుతోంది.
✍️చంద్రబాబు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి కోర్టులో సీఐడీ వారు తెలిపిన వివరాలు సంచలనాత్మకంగా ఉన్నాయని చెప్పాలి. 2015 నుంచి 2019 వరకు టీడీపీ ఖాతాలోకి నగదు డిపాజిట్ అయిన వైనాన్ని టేబుల్ తో సహా వివరించారు. దాని గురించి వివరణ ఇవ్వాలని సీఐడీ తెలుగుదేశం పార్టీ వారిని కోరుతుంటే, ఆ పార్టీ నేతలు తప్పించుకుని తిరుగుతున్నారు. తొలుత నాలుగువారాల టైమ్ కావాలని అడిగిన టీడీపీ ,ఆ గడువు పూర్తి అయినా , ఆ సంబంధిత సమాచారం ఇవ్వలేదంటేనే అందులో ఉన్న మతలబు అర్ధం అవుతుంది. అడ్డంగా దొరికిపోయినందునే బ్యాంకు స్టేట్ మెంట్ వివరాలు ఇవ్వకుండా ,స్పందించకుండా తేలు కుట్టిన దొంగ మాదిరి సైలెంట్ అయిపోయారంటేనే కచ్చితంగా ఇందులో అక్రమధనం భారీగా చేరినట్లు అనిపిస్తుంది.సీఐడీ వారు టీడీపీ ఖతాలోకి 27 కోట్లు వచ్చాయని ప్రకటిస్తే, అదంతా ఎలొక్టరల్ బాండ్లు అని టీడీపీ ఎపి అధ్యక్షుడుఅచ్చెన్నాయుడు చెబితే, తమ కార్యకర్తలు వందరూపాయల చొప్పున అరవైఐదు కోట్ల రూపాయలు సభ్యత్వ రుసుంగా చెల్లించారని మాజీమంత్రి నారా లోకేష్ చెప్పారు.
✍️దీనికి సంబంధించిన ఆధారాలు చూపించడానికి వారు ఆసక్తి కనబరచలేదు.అదే టైమ్ లో సీఐడీ బ్యాంకుల నుంచి వివరాలు సేకరించి మొత్తం ఆధార సహితంగా చూపిస్తోంది.ఇక ఒక నిందితుడు పెండ్యాల శ్రీనివాస్ అమెరికా పారిపోయి ఇండియాకు రాకపోవడం, మరో నిందితుడు కిలారు రాజేశ్ సీఐడీ విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు తెరదీయడం వంటివి చూస్తే నైపుణ్యాభివృద్ది సంస్థ నిదులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా పొందారన్న సంగతి నిర్ధారణ అయినట్లు అనుకోవాల్సి వస్తుంది. ఈ కేసు ఒక్కటే కాదు. మిగిలిన స్కామ్ లలో కూడా వచ్చిన అక్రమ నిధులను కొంతమేర టీడీపీ ఖాతాకుమళ్లించారన్న అభియోగాలు వస్తున్నాయి.ఈ నేపధ్యంలో స్కామ్ ను కోర్టువారు పరిగణనలోకి తీసుకుంటే బెయిల్ రావడం కష్టమే అవుతుంది. ఇలాంటి అవినీతి కేసులలో బెయిల్ ఇవ్వడానికి కోర్టులు సుముఖంగా ఉండవు. సుప్రింకోర్టు సైతం ఈతరహా గైడ్ లైన్స్ ను గతంలో కూడా ఇచ్చింది.
✍️ఇక ఆరోగ్య విషయాలు చూస్తే ప్రైవేటు వైద్య సంస్థ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయనకు గుండె ఈసిజి బాగానే ఉందికాని, ఇతర సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.అలాగే చర్మ వ్యాధికి సంబంధించి రిపోర్టు ఇచ్చారు. గుండె,చర్మ వ్యాధుల విషయంలో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ,మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.అదే టైమ్ లో ఆయన పబ్లిక్ ఫిగర్ కనుక ఆయనతో పాటు ఒక ప్రత్యేక అంబులెన్స్ ఉండాలని సూచించారు. ఇక్కడే విషయం అర్ధం కావడం లేదు. నిజంగా చంద్రబాబుకు అంత ఆరోగ్య సమస్య ఉంటే ఆయన ఎక్కడకు కదలకూడదని డాక్టర్ లు చెప్పాలి. మూడు నెలలు విశ్రాంతి అవసరం అని సిఫారస్ చేసినప్పుడు ఆయన జనంలోకి ఎలా వెళ్లగలుగుతారు.ఆయన ఒత్తిడికి గురి కాకుండా ఎలా ఉంటారు?. డాక్టర్‌ల ప్రకటనలో వైరుధ్యం కనిపిస్తుంది.
✍️అంటే చంద్రబాబుకు ఆరోగ్యం కన్నా రాజకీయమే ముఖ్యమని డాక్టర్ లు కూడా భావిస్తున్నారా? లేదా బెయిల్ కోసం ఇలాంటి నివేదికను వ్యూహాత్మకంగా రూపొందించారా?అన్నది చూడాల్సిఉంది.నిజానికి ప్రభుత్వ వైద్య సంస్థలు ఇచ్చే నివేదికలపై కోర్టులు ఆధారపడవలసి ఉంటుంది. లేదా ప్రత్యేక మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాలి.అలాకాకుండా ప్రైవేటు సంస్థలు ఇచ్చే నివేదికలను పరిగణనలోకి తీసుకుంటే పలుకుబడి,పరపతి, డబ్బు కలిగిన వ్యక్తులు తమ నేరాలను కప్పిపుచ్చుకోవడానికి, బెయిల్ పొందడానికి అందరూ క్యూ కట్టే అవకాశం ఉంటుంది.
మొత్తం మీద చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన డాక్టర్ లు ఇచ్చిన రిపోర్టులు పరిశీలిస్తే,చంద్రబాబు ఇకపై రాజకీయాలు చేయడం కష్టమేమోననిపిస్తుంది. ఆయన ర్యాలీలలో పాల్గొని రెచ్చి పోయి మాట్లాడడం ప్రమాదకరం అని అనుకోవాల్సి వస్తుంది. కాని చంద్రబాబు ఆరోగ్య బెయిల్ పై రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పద్నాలుగు గంటలు నిద్రకూడా మాని కారులో ఎలా ప్రయాణించారో అర్దం కాదు! ఈ రకంగా చంద్రబాబు తన ఆరోగ్య విషయంలో కోర్టులను తప్పు దారి పట్టించడానికి అవసరమైన వ్యూహాలను అమలు చేస్తున్నారని ఎవరైనా అనుకోవచ్చు. టీడీపీ ఖాతాలోకి భారీగా వచ్చిన నల్లధనం గురించి జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్న తీరు, జనానికి తెలియకుండా ఉండడానికి తనకు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను ఉపయోగించుకుంటున్న వైనం చూస్తే అవినీతి కేసులలో ఒక ప్రత్యేక రికార్డు సృష్టించారనిపిస్తుంది.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment