ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాపై వివాదం సృష్టించి ప్రజలలో అనుమానాలు కలిగించడానికి ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు ఈనాడు , ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. దేశంలో ఎక్కడా బోగస్ ఓట్లు ఉండకూడదు. అలాగే అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటును కోల్పోరాదు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాని ఏదో రకమైన సందేహాలు వ్యాప్తి చేయాలన్న లక్ష్యంతో వీరు చేస్తున్న గోలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటరే ఇచ్చిందని చెప్పాలి. ప్రతి ఓటును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఆ పార్టీ సూచించింది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ సూచన. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా, న్యాయపరమైన కొన్ని అడ్డంకులు ఎదురవుతుండడం దురదృష్టకరం.హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం అయ్యేలా ప్రయత్నాలు చేశారు.
✍️మరి మిగిలిన చోట్ల ఎందుకు అలా జరగడం లేదో తెలియదు. కాని ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి,దొంగ ఓట్ల గోల పోవడానికి ఇది అత్యవసరం. వైసీపీపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా కాని ఈ ప్రతిపాదనపై ఎందుకు స్పందించడం లేదు? తెలుగుదేశం నేతలు కూడా ఒక ప్రతినిధి బృందంగా ఎన్నికల ముఖ్య అధికారిని, అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని ఎందుకు అడగడం లేదు? ఇక్కడే దొరికిపోతున్నారు. వీరికి చిత్తశుద్ది లేదని అర్ధం అయిపోతుంది. ఓటర్ కార్డును ఆదార్ కార్డును లింక్ చేయడం వల్ల ఒక ఓటరు రెండు చోట్ల ఓట్లు పొందే అవకాశం పోవచ్చు.
✍️ఇతర రాష్ట్రాలలో నివసిస్తూ ,అక్కడ ఆధార్ కార్డు ఉండి, ఓటు మాత్రం ఏపీలో ఉంటే వాటిని అరికట్టవచ్చు. కొందరు రెండు రాష్ట్రాలలో ఓట్లు వేస్తుంటారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి వందలాది బస్ లలో ఓటర్లను తరలిస్తుంటారు. వారిని దొంగ ఓట్లుగా పరిగణించాలా? లేక మరో రకంగా చూడాలా? వీరికి ఓటు కు ఇంత అని చొప్పున డబ్బు కూడా ఇస్తుంటారు.
ఈ మొత్తం ఇటీవలికాలంలో రెండువేల రూపాయల వరకు వెళ్లింది. వీటన్నిటికి ఉన్న ఒక మందు ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానం చేయడం. ఈ సూచన చేయడానికి నైతికంగా ధైర్యం ఉండాలి. ఆ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయగలిగింది. వారికి తమ మీద తమకు నమ్మకం ఉండడం వల్ల, ప్రజలలో తమకు మద్దతు ఉందన్న విశ్వాసం వల్ల ఈ ప్రతిపాదనన చేసి సిఈఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఓటర్ల జాబితాలలో ఉన్న అక్రమాలను అధికారులు సరిచేస్తుంటే, దానిపై టీడీపీ గగ్గోలు పెడుతోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీది ప్రత్యేక రికార్డే అని చెప్పాలి.
✍️ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలోనే వేలాది బోగస్ ఓట్లను చేర్పించారన్నది బహిరంగ రహస్యమే.కర్నాటక, తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి కూడా ఓటర్లను తెచ్చి కుప్పంలో చేర్పించారట. అంటే వారు తమ సొంత రాష్ట్రంతో పాటు కుప్పంలో కూడా ఓట్లు వేస్తుంటారన్నమాట. ఇది చట్ట విరుద్దం. ఈ బోగస్ ఓట్లతోనే చంద్రబాబుకు అత్యధిక మెజార్టీ వస్తుంటుందని వైసీపీ తరచుగా విమర్శిస్తుంటుంది. గతంలో ఇక్కడ పోటీచేసిన మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి దొంగ ఓట్లను తొలగించడానికి విశ్వయత్నం చేశారు.కాని పూర్థి స్థాయిలో చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఈ బోగస్ ఓట్లను తొలగించడానికి యత్నిస్తున్నారు. ముందుగా దీనికి చంద్రబాబు జవాబు చెప్పగలగాలి.ఇంత అనుభవం కలిగిన నేత తన నియోజకవర్గంలోనే కనీస నిజాయితీతో వ్యవహరించకపోతే , ఇతరులకు ఆయన నీతులు చెప్పడం అనైతికం అవుతుంది.
✍️ఇతర టీడీపీ నేతలకు కూడా ఇలాంటి ఆలోచనలే ఆయన ఇస్తుంటారని అనుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు సేవామిత్రలని కొంతమందిని ఆయా నియోజకవర్గాలకు పంపించి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతుదారులు అనుకుంటే వారి ఓట్లను తొలగిస్తున్న విషయాన్ని అప్పట్లోనే కనుగొన్నారు.దానిపై ఆందోళనకు దిగి కొంత కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కన్నా ఈనాడు, ఆంద్రజ్యతి వంటివి మరీ ఎక్కువ గొడవ చేస్తూ వైసీపీపై బురద చల్లుతున్నాయి. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటి గురించి రాయడం తప్పు కాదు. కాని ఆ మొత్తం అంతా వైసీపీపై నెట్టడమే దారుణంగా ఉంటుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కొందరు బోగస్ ఓట్లపై ఒక ఫిర్యాదును సిఈఓకి అందచేశారు. పలు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒక అడ్రస్ లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని వారు అధికారికి వివరించారు. విశేషం ఏమిటంటే టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఇలాంటి ఓట్లను తొలగిస్తుంటే, అక్రమంగా టీడీపీ ఓట్లు తీసేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది.
✍️అదే వైసీపీ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాలలో ఎక్కడైనా బోగస్ ఓట్లు ఉంటే అవన్ని వైసీపీనేనని ప్రచార చేయడం అలవాటుగా మారింది. 2023 ఓటర్ల జాబితాను పరిశీలిస్తే, పేరు,అడ్రస్ లలో కొద్ది మార్పులు, పోటో మార్పు, ఒకరికే రెండు,మూడు చోట్ల నమోదు అవడం వంటివి చూస్తే సుమారు నలభై లక్షల మేర ఉన్నాయని వైసీపీనేతలు ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ,ఏపీ రెండు రాష్ట్రాలలో రెండు చోట్ల ఉన్న ఓట్ల సంఖ్య పదహారు లక్షల ఓట్లు ఉన్నాయని వీరు లెక్కగట్టారు. కొన్ని ఇళ్లలో వందకు మించి ఓట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వాటిలో అత్యధికం తెలుగుదేశం హయాం నుంచి ఉన్నాయని వైసీపీ సాధికారికంగా ఫిర్యాదు చేసింది. కాని ఈనాడు, జ్యోతి వంటివి మాత్రం అవన్ని ఇప్పుడే చేర్చినట్లు దుష్ప్రచారం చేస్తుంటాయి.
✍️2019 ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలను అప్పుడే పిర్యాదు చేసినా, అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు వాటిని సరిచేస్తుంటే తెలుగుదేశం గగ్గోలు పెడుతోందన్నది వీరి వాదన. నిజంగానే ఎక్కడైనా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పోతే , ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే సంబంధితర ఫారం పూర్తి చేసి మళ్లీ ఓటు పొందవచ్చు.కాని అలాకాకుండా బోగస్ ఓట్లు కూడా యధావిధిగా కొనసాగాలన్నట్లుగా ప్రతిపక్షం కాని, వారికి మద్దతు ఇచ్చే మీడియా కాని వ్యవహరించడమే చోద్యంగా కనిపిస్తుంది.మరో విషయం ఏమిటంటే తెలుగుదేశం ఆరోపిస్తున్న విధంగా వేలాది ఓట్లను అక్రమంగా తొలగిస్తుంటే, ఓటర్ల సంఖ్య తగ్గాలి కదా? అలాకాకుండా గతంలో ఉన్నట్లుగానే దాదాపు నాలుగు కోట్ల ఓట్లు అలాగే ఉన్నాయి.
✍️అయినా టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. వీటన్నిటికి పరిష్కారంగా ఓటర్ ఐడి కార్డుకు,ఆధార్ కార్డును అనుసంధానం చేయడమే సరైనది అని చెప్పాలి. ఇదే విషయాన్ని వైసీపీనిర్దద్వందంగా ప్రకటించగా, టీడీపీ ఎందుకు వెనుకాడుతోంది?చంద్రబాబు ఏమి చేసినా డబుల్ గేమ్ గానే చేస్తుంటారు. తాను బోగస్ ఓట్లను చేర్పించి,ఎదుటివారిపై ఆరోపణ చేస్తుంటారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ముఖ్య అధికారి వద్దకు వెళ్లి నానా రచ్చ చేశారు. అదే ఇంకెవరైనా వెళితే వారికి అధికారులను గౌరవించడం తెలియదని విమర్శిస్తుంటారు.తాను ఓడిపోతే ఈవిఎమ్ ల లో మోసం జరిగిందని అంటారు. అదే తాను గెలిస్తే మాత్రం ఆ ఊసే ఎత్తరు. ప్రస్తుతం దొంగ ఓట్లు అంటూ పెద్ద గొంతుతో అరిస్తే, రేపు ఎన్నికలలో ఓటమి ఎదురైనా, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ప్రచారం చేయాలన్నది వారి ఉద్దేశం కావచ్చు. లేదా తాము ఆశించిన రీతిలో టీడీపీ బోగస్ ఓట్లు అన్ని పోతున్నాయన్న దుగ్ద కావచ్చు. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థను ఒప్పించి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనడం అవసరం అని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment