ఇది ఆసక్తికరమైన వార్తే. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక పయనీర్ విశాఖపట్నం నుంచి ఒక కథనాన్ని ఇస్తూ ఏపీలో చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే బేస్ కరిగిపోతోందని పేర్కొంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఆ వార్తను రాసిన విలేకరి వివరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉండటంపై ప్రజల్లో స్పందన రానురాను తగ్గుతోందని, దీంతో తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారిందని విశ్లేషించారు. తొలుత చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ప్రజలలో సానుభూతి వస్తుందని, సత్వరమే ఆయన జైలు నుంచి బయటకు వస్తారని క్యాడర్ ఆశించగా, దానికి విరుద్దంగా పరిస్థితి ఏర్పడింది. దీంతో జనంలో ఈ పరిణామాలపై ఆసక్తి తగ్గుతోంది. కాలం గడిచే కొద్దీ ప్రజలలో స్పందన కొరవడుతోందని క్యాడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలోనే అతి ఖరీదైన లాయర్లను తీసుకు వచ్చి చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆశించిన ఊరట రాకపోవడం టీడీపీ క్యాడర్‌ను ఆశ్చర్య పరుస్తోంది. ఇంతకాలం చంద్రబాబు ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయగలరనుకుంటే, ఆయన వరకు వచ్చేసరికి వ్యవహారం ఇలా మారిందేమిటా అని విస్తుపోతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు, ర్యాలీలు, పోస్టుకార్డు ద్వారా నిరసనలు, కొవ్వొత్తులు, ఈలలు ఊదడం, కంచాలు కొట్టడం వంటి ఆందోళన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చినా, ప్రజల నుంచి సహకారం అందకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. రిలే నిరసన దీక్షలు చేయాలని పార్టీ కోరుతున్నా, వివిధ కారణాల వల్ల ఆశించిన లక్ష్యాలు నెరవేరడంలేదని ఆ పత్రిక స్పష్టం చేసింది. కొద్ది చోట్ల రిలే దీక్షలు ఉదయం ఆరంభమై, మధ్యాహ్నానికి ముగుస్తున్నాయి. శిబిరాలలో హాజరవుతున్న ఆ కొద్ది మందిని నిలబెట్టుకోవడం నిర్వాహకులకు సమస్యగా మారుతోందట.
చంద్రబాబు కేసులను పార్టీ కార్యకర్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే సీఐడీ చూపుతున్న ఆధారాలపై చర్చించుకుంటున్నారు. దాంతో చంద్రబాబుకు ఇప్పట్లో ఊరట లభించదేమో అన్న భావనకు ప్రజలతో పాటు, కార్యకర్తలు కూడా వచ్చారు. ఈ నిరసనల్లో పాల్గొనడానికి పలువురు ఇష్టపడకపోవడానికి మరో కారణం ఏమిటంటే ఆర్దిక విషయాలు అని ఆ పత్రిక విశ్లేషిస్తోంది. ఈ నిరసనలకు జన సమీకరణ, ఇతర ఖర్చులకు అవసరమయ్యే డబ్బు సమకూర్చుకోవడం తలనొప్పిగా మారిందట. ఎప్పటికప్పుడు కోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తుండడంతో టీడీపీ క్యాడర్ ఈ డబ్బు వ్యయం కూడా వృధా అవుతోందా అని భావిస్తూ ఖర్చుకు వెనుకాడుతున్నారట. అదే సమయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడడం వల్లే ఆయన ఇంతకాలం జైలు నుంచి విడుదల కాలేకపోయారన్న అభిప్రాయం కూడా ప్రబలంగా వ్యాప్తిలోకి వచ్చింది. దీంతో ప్రజలను ఈ విషయాలపై కన్విన్స్ చేయడం కూడా సాధ్యపడటంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయట.
ఈ మధ్య కాలంలో ఇలాంటి విశ్లేషణ ఆంగ్ల పత్రికలలో రావడం అరుదుగా జరుగుతోంది. పయనీర్ రాసిన ఈ కథనం టీడీపీ బేజారు పరిస్థితికి దర్పణం పడుతోందని చెప్పవచ్చు.నిజానికి చంద్రబాబు అరెస్టు అయిన రోజు నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ప్రజల్లో స్వచ్చందంగా రియాక్షన్ లేకపోవడంతో పార్టీపరంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో పాటు ఆయా చోట్ల టీడీపీ నేతలు మాత్రమే ఈ నిరసనల్లొ పాల్గొంటున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలు కార్యకర్తలను ఉత్తేజపరచడంలో విఫలం అవుతున్నారు. లోకేష్ అయితే ఎక్కువకాలం ఢిల్లీలోనే గడపడం కూడా టీడీపీ క్యాడర్‌లో నైతిక స్థైర్యం తగ్గించింది.
అరవై, డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని గొప్పగా చెప్పుకునే పార్టీలో కనీసం పది శాతం కూడా పార్టీ పిలుపునకు రియాక్ట్ అవడంలేదని పార్టీ వర్గాలే వాపోతున్నాయి. నిజంగా అంత మంది స్పందిస్తే చాలా ప్రభావం కనిపించేది. ఆ పరిస్థితి లేకపోవడమంటే పార్టీ ఎంత నిస్తేజంలో ఉందో అర్ధమవుతోందని కొందరు ఉత్తరాంధ్ర సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఏదో తప్పు చేయకపోతే లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారన్న ప్రశ్న కార్యకర్తలతో పాటు, జనసామాన్యంలో ఎదురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు, వారికి సంబంధించిన టీవీల్లో మాత్రం నిరసన ఒక వెల్లువ మాదిరి సాగుతోందన్నట్లు పెద్దపెద్ద శీర్షికలు పెడుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పుడు పయనీర్ ఇచ్చిన ఈ కథనంతో ఆ విషయం మరింతగా బలపడుతోంది. సానుభూతి రావడం లేదు సరికదా.. ఉన్న టీడీపీ బేస్ కరిగిపోవడం ఆ పార్టీవారికి ఆందోళన కలిగించే విషయమే. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కోలుకోగలుగుతుందా అంటే డౌటే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment