పవన్‌కు కొత్త సంకటం.. ఉక్కిరిబిక్కిరవుతున్న జనసేనాని? | KSR Comments Over Pawan Kalyan And Chandrababu Alliance | Sakshi
Sakshi News home page

పవన్‌కు కొత్త సంకటం.. ఉక్కిరిబిక్కిరవుతున్న జనసేనాని?

Published Sat, Sep 30 2023 9:32 AM | Last Updated on Sat, Sep 30 2023 11:32 AM

KSR Comments Over Pawan Kalyan And Chandrababau Alliance - Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. తాను అక్టోబర్ ఒకటి నుంచి తలపెట్టిన వారాహి యాత్రలో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియని గందరగోళంలో ఉన్నారనిపిస్తుంది. అందువల్లే ఆయన గత పదిహేను రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులకు సంబందించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. తొలుత ఏదో ఆవేశంలో టీడీపీతో పొత్తు ప్రకటించి, చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారని విమర్శించినా, తీరా గత రెండు వారాల పరిణామాలతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో పవన్ పడి ఉండాలి. జనసేన వెబ్‌సైట్‌లో వారి ఏడు సిద్దాంతాలలో అవినీతిపై రాజీలేని పోరాటం ఒక అంశంగా ఉంది. 

కానీ, ఇప్పుడు అందుకు విరుద్దంగా మిత్రపక్షంగా ప్రకటించిన తెలుగుదేశం అవినీతిని సమర్దించవలసి వస్తోంది. కొన్ని చోట్ల టీడీపీవారితో కలిసి జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నా, పవన్ మాత్రం నోరు విప్పడం లేదు. చంద్రబాబును ఏపీ సీఐడి నంద్యాలలో అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌పై రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఆ వెంటనే పవన్ హడావుడిగా జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి, తదుపరి రాజకీయ చర్చలు జరిపి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు. అది పెద్ద సంచలనం అయింది. జనసేన కార్యకర్తలే దిగ్బ్రాంతికి గురయ్యేలా ఆయన వ్యవహరించారు. 

ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అవినీతి కేసుల్లో ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉంటే పవన్ తొందరపడి ఇలా చేశారేమిటా అని జనసేన క్యాడర్ బహిరంగంగానే చర్చించుకున్నారు. దానికి తోడు ఆయన ఏకంగా జనసేనను చంద్రబాబుకు, టీడీపీకి సరెండర్ చేసినట్లు మాట్లాడడం మరింత ఆశ్చర్యం కలిగించింది. టీడీపీవారు ఎవరైనా జనసేన కార్యకర్తలను ఏమన్నా అన్నా పడాలని, తగ్గి ఉండాలని చెప్పడం  మరింత పరువు తక్కువ అయింది. జనసేన క్యాడర్ ఆత్మాభిమానాన్ని పవన్ టీడీపీకి తాకట్టు పెట్టినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తం అయింది.  

ఆ తర్వాత  15 రోజులుగా పవన్ నోరు విప్పలేదు. ఆయన సోదరుడు నాగబాబు తిరుపతి వెళ్లి క్యాడర్‌ను కాస్త చల్లచరిచేలా మాట్లాడే యత్నం చేశారు. టీడీపీకి మనమే దిక్కని, పవన్ సీఎం అభ్యర్ది అవుతారన్న సంకేతం ఆయన ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత రోజు మాత్రం ఆయన అందుకు విరుద్దంగా మాట్లాడినట్లు అనిపించింది. చంద్రబాబు జైలులో ఉన్న పరిస్థితి గురించి ఆయన మాట్లాడినట్లు అనిపించలేదు. కార్యకర్త ఒకరు మనం రెండు పార్టీల జెండాలు మోయాల్సిందేనా అని ఆయన ప్రశ్నించిన వీడియో వైరల్ అయింది. రెండు పార్టీల మధ్య సమన్వయకర్తగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల గురించి ఏమీ మాట్లాడకుండా పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ వారాహియాత్ర మళ్లీ ఆరంభం అవుతుంది. సహజంగానే ఇప్పుడు ఆయనకు ఎదురయ్యే ప్రశ్న చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల గురించి మాట్లాడతారా?లేదా? కొన్నాళ్ల క్రితం అన్నట్లు చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారన్నదానికే కట్టుబడి ఉంటారా?. ఈ మధ్య కాలంలో కోర్టులలో జరిగిన వాదోపవాదాలు, సీఐడీ చూపుతున్న సాక్ష్యాధారాలను గమనిస్తే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్న సంగతి తెలుస్తుంది. దానికి తగ్గట్లు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ అమెరికా పారిపోవడం, లోకేష్ సన్నిహితుడు రాజేష్ కనిపించకుండా పోవడం, అలాగే లోకేష్ ఢిల్లీలోనే మకాం చేసి ఏపీకి రాకుండా ఉండడం, చివరికి సీఐడీ నోటీసు తీసుకోకుండా దాగుడుమూతలు ఆడడం ఇవన్ని వారు చేసిన స్కాములకు ఆధారాలుగా కనిపిస్తాయి. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్, అమరావతి అస్సైన్ మెంట్ లాండ్ అక్రమాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు మొదలైనవాటిలో సీఐడీ చాలా పకడ్బందిగా ఫైల్ సిద్దం చేసినట్లు ఇంతవరకు జరిగిన పరిణామాలు తెలియచేస్తున్నాయి.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఒక నిందితుడుగా ఉన్న లింగమనేని రమేష్‌తో పవన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటం, ఆయన పవన్‌కు కూడా కొంత భూమి అక్కడ ఇవ్వడం వంటివి ప్రజలలో అనుమానాలకు దారి తీస్తున్నాయి. దీంతో రాష్ట్రం అంతటా తెలుగుదేశం అవినీతి చర్చనీయాంశంగా ఉండగా, పవన్ ఆ విషయాలు మాట్లాడకుండా కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తే ప్రజలలో పవన్ పరపతి మరింత దెబ్బతింటుంది. జనసేన కేడర్‌ కూడా అసంతృప్తి ఏర్పడుతుంది. అవినీతిపై రాజీలేని పోరాటం అంటూ గొప్పగా తన సిద్దాంతం అని రాసుకున్న పవన్ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లపై వచ్చిన అవినీతి ఆరోపణలను సమర్థిస్తే ఆయనకూ వాటా ఉందని జనం అనుకునే అవకాశం ఉంటుంది. అలాగని అవినీతి ఆరోపణలను వ్యతిరేకిస్తే పొత్తు పెట్టుకుంటామన్న తెలుగుదేశంకు కోపం వస్తుంది. ఈ రకంగా పవన్ కల్యాణ్‌ ఇరుక్కుపోయినట్లయింది. టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగే దశను ఆయనే చేజేతులారా వదలుకున్నట్లయింది. బహుశా పవన్ మరో రకంగా అంచనా వేసుకుని ఉండాలి.

చంద్రబాబు అరెస్టు అయిన మరుసటిరోజో, ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనో జైలునుంచి విడుదల అవుతారని, న్యాయ వ్యవస్థలో చంద్రబాబుకు ఆ మేర పరపతి ఉందని పవన్ అనుకుని ఉండాలి. పైగా సానుభూతి వస్తుందని ఆశించి ఉండాలి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇరవై రోజులు దాటినా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. లోకేషేమో ఢిల్లీలో ఉండిపోతున్నారు. ఆయన పాదయాత్ర ఆరంభిస్తారని చెప్పినా, ఆ వెంటనే వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై  జనంలో పెద్ద సానుభూతి కనిపించడం లేదు. ఆ విషయం స్వయంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణిల ప్రకటనలలోనే తేలిపోయింది. ప్రజలంతా మౌనంగా ఉంటున్నారని, చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని వారు తమ ప్రకటనలలో కోరుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్‌పై ఒక పెద్ద బాధ్యతే పడింది. 

అవినీతి ఆరోపణలపై చంద్రబాబు అరెస్టు అవడంతో టీడీపీ కేడర్‌లో ఏర్పడిన నైరాశ్యాన్ని తగ్గించే పని కూడా ఆయనదే అన్నట్లుగా పరిస్థితి మారింది. అలా చేస్తే జనంలో పలచన అవుతామన్న భయం ఉంది. కాకపోతే దీనిని కాస్త కప్పిపుచ్చడానికి ఎవరో గాని ఒక ప్రచారం పెట్టారు. టీడపీ, జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి అని, పవన్ ఆ తర్వాత రెండేళ్లు, తదుపరి లోకేష్ మిగిలిన రెండేళ్లు సీఎంగా ఉంటారని సోషల్ మీడియాలో ఒక కథనం వ్యాప్తిలోకి వచ్చింది. అది నమ్మశక్యంగా లేదు. అదే నిజమైతే పవన్ లేదా నాగబాబు వంటివారు పార్టీ కేడర్‌కు ఏదో రూపంలో ఆ విషయం చెప్పి ఉండేవారు. అలాకాకుండా  సీఎం ఎవరన్నది ఎన్నికల తర్వాత తీసుకునే నిర్ణయమని మాత్రమే పవన్ అంటున్నారు. పైగా ఒకసారి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి వస్తే ఆయన పవన్‌కు ఆ పదవి ఇవ్వడానికి సిద్దపడతారా? అన్న ప్రశ్న ఎటూ ఉంది. 

వీటన్నింటికి మించి అసలు అధికారం వచ్చే అవకాశమే కనుచూపు మేరలో కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు అవినీతి కేసులలో చిక్కుకుని విలవిలలాడుతుండడంతో టీడీపీ కేడర్‌ అయోమయంలో పడింది. ఆ పార్టీ కకావికలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ నిలబడినా, ఎన్నికలలో  వైఎస్సార్‌సీపీ ధీటుగా సమాయత్తం అవడం కష్టం అన్న భావన ఉంది. పార్టీ అధినేతలు ఎప్పటికీ  ఈ కేసుల నుంచి బయటపడతారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదంతా ఆ పార్టీని తీవ్ర గందరగోళంలోకి నెడుతోంది.

ఈ నేపథ్యంలో తొందరపడి టీడీపీతో పొత్తు ప్రకటించి దెబ్బతిన్నామా అన్న సంశయం జనసేన కేడర్‌కు సహజంగా వస్తుంది. పవన్ అవనిగడ్డ పర్యటనలో ఈ విషయాలపై ఎలా స్పందిస్తారన్నది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన పవన్ ఇప్పుడు అదే అవినీతిని భుజాన వేసుకుని సమర్ధించవలసి రావడం ఆ పార్టీ దయనీయ స్థితికి దర్పణం పడుతుంది. చంద్రబాబు, లోకేష్ ల కోసం అవినీతిపై రాజీలేని పోరాటమన్న తమ సిద్దాంతానికి పవన్ కళ్యాణ్  తిలోదకాలు ఇస్తారా?.


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement