Babu : కేవలం ఆ కులానికే నాయకుడా? | KSR Comments Over Political Leaders Support To Chandrababu | Sakshi
Sakshi News home page

Babu : కేవలం ఆ కులానికే నాయకుడా?

Published Sat, Sep 16 2023 1:45 PM | Last Updated on Sat, Sep 16 2023 4:22 PM

KSR Comments Over Political Leaders Support To Chandrababu - Sakshi

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో అరెస్టు చేయడంపై తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్న తీరు కొంత ఆశ్చర్యంగాను, మరికొంత ఆసక్తికరంగాను ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీరు మాట్లాడుతున్నట్లుగా తెలిసిపోతుంది. చివరికి వీరంతా కలిసి చంద్రబాబును  ఒక కుల నాయకుడుగా  పరిమితం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది. 

ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ వంటి పార్టీల నేతలు కొంచెం గట్టిగా స్పందించారు. నిజానికి ఏపీ పరిణామాలతో వీరెవ్వరికి సంబంధం లేదు. వీరేదో ప్రజాస్వామ్యం కోసమో, లేక చట్టం, రాజ్యాంగం కోసమో మాట్లాడలేదు. అవినీతికి వ్యతిరేకంగా స్పందించలేదు. చంద్రబాబు వీటన్నింటికి అతీతుడు అన్న ధోరణితో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును కమ్మ సామాజికవర్గంపై దాడిగా  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చెప్పడం విడ్డూరంగానే ఉంటుంది. ఒక రకంగా కమ్మ కులానికి ఈ కేసుకు లింకు పెట్టి ఆ కులం పరువు తీస్తున్నారు. 

✍️చంద్రబాబుకు వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వదలిస్తే , అవినీతిని సమర్ధించదలిస్తే ఆమె సొంతంగా చేసుకోవచ్చు. కానీ, ఆ మొత్తాన్ని కమ్మ కులానికి అంటించడం నీచంగా అనిపిస్తుంది. గతంలో ఆమె టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆమెతో సహా కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయలేదా?. అప్పుడు కమ్మ కులంపై  దాడిగా పరిగణించరా?. గతంలో సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై ఆనాడు ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించడాన్ని రెడ్డి సామాజికవర్గంపై దాడి అని ఆమె ఎన్నడైనా చెప్పారా?. ప్రస్తుతం  రేణుకా చౌదరి.. సీఎం జగన్‌పై కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి కారణం ఖమ్మం  జిల్లాలో కమ్మ సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉండడంతో వారి మద్దతు కూడగట్టుకునే కృషిలో భాగంగా  ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఆ వర్గం వారిలో అలాంటి అపోహలు సృష్టించడమే ఆమె ఉద్దేశం. 

అదీ కాకుండా ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభావం పార్టీలో పెరగడం కూడా ఆమెకు ఇష్టం ఉండకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాలేరు సీటును ఆశిస్తున్నారు. అక్కడ నుంచి పోటీచేస్తానని గతంలో ఆమె ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసే ఆలోచన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు రేణుకకు నచ్చడం లేదు. అందుకే షర్మిల గురించి కూడా అనవసర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు అరెస్టుపై షర్మిల ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఆమె మాటల్లో కాంగ్రెస్ వాదం కన్నా, కుల భావనే అధికంగా  కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో ఆ ప్లాంక్‌పై గెలవాలన్నది ఆమె లక్ష్యం కావచ్చు. పోనీ నిజంగానే ఆమెకు చంద్రబాబుపై రాజకీయంగా, లేదా కుల పరంగా అంత అభిమానం ఉందా అంటే అవునని చెప్పలేం. 

✍️1994లో ఆమె టీడీపీకి దూరమై సొంతంగా లాంతరు గుర్తు మీద పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో జరిగిన పరిణామాలతో తిరిగి పార్టీలో ప్రవేశించారు. కేంద్రంలో ఐకె గుజ్రాల్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆ సమయంలో ఆమె తాను  అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు కన్నా పవర్‌ఫుల్ అన్నట్లు వ్యవహరించడంతో ఆయన ఈమెను దూరం పెట్టారని చెబుతారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి ఎంపీగా గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆమె సడన్‌గా చంద్రబాబు మద్దతుదారు అయిపోయారు. దానికి కారణం ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజికవర్గ ప్రభావం అధికంగా ఉండడం, వారిలో ఎక్కువ మంది టీడీపీకి అనుకూలంగా ఉండడం, వారిని ఆకర్షించే  పనిలో ఉన్న ఆమె అదేదో కులానికి జరిగిన నష్టంగా చూపించి తను లబ్ది పొందాలన్న తాపత్రయం తెలుస్తూనే ఉంది. అంతే తప్ప చంద్రబాబు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని అనుకోజాలం. 

అదే సమయంలో ఆమె తన  రాజకీయస్వార్దం కోసం పార్టీలోని కొన్ని వర్గాలను దూరం చేయడానికి కూడా వెనుకాడటం లేదనిపిస్తుంది. సీఎం జగన్, షర్మిలపై పరుష వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణలోని రెడ్డి వర్గాన్ని, వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వివిధ వర్గాలను కాంగ్రెస్ దరికి చేరకుండా అడ్డుపడినట్లు కూడా అవుతుందన్న భావన ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈమె కన్నా చంద్రబాబుకు చాలా సన్నిహితుడు. అయినా ఆయన ఇంతవరకు స్పందించకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ, రేణుకా చౌదరి తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా రెచ్చిపోయి మాట్లాడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. కాకపోతే ఆయన కొంతకాలం చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేశారు కనుక ఆ భావన ఉండవచ్చు. అదే టైమ్‌లో ఖమ్మం రాజకీయాలు కూడా ప్రభావితం చేసి ఉండవచ్చు. 

✍️ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కావాలని చంద్రబాబుకు అనుకూలమైన ప్రకటనలు చేస్తూ బీజేపీ పరువును తీస్తున్నారు. ఎవరైనా సాధారణ స్థాయి నేతలు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. కానీ, జాతీయ హోదాకు వెళ్లిన ఆయన ఇలా చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీని, హోం మంత్రి  అమిత్ షాను అవమానిస్తున్నట్లుగా ఉంది. మోదీనే ఏపీకి గత ఎన్నికల సమయంలో వచ్చి చంద్రబాబు అవినీతి చేశారని ప్రసంగించి వెళ్లారు. మోదీని చంద్రబాబు నానా విధాలుగా దూషించారు. ఈ మధ్యనే కేంద్ర ఆదాయశాఖ చంద్రబాబుకు 118 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముకు లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చింది.  వాటిని పట్టించుకోకుండా సంజయ్ మాట్లాడటం కూడా కుల రాజకీయమే అని చెప్పాలి. 

బీజేపీకి హైదరాబాద్‌లోనే కాస్త పట్టు ఉందన్న భావన ఉంది. అక్కడ వివిధ నియోజకవర్గాలలో కమ్మ సామాజికవర్గ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఆ ఓట్లను దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వైఎస్సార్‌సీపీకి మైనస్ అని కూడా చెప్పారని టీడీపీ మీడియా ఊదరగొడుతోంది. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలుత అటూ, ఇటూ కాకుండా స్పందించారు. ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ మాట్లాడారు. అంటే, బండి కంటే వెనుకబడకూడదన్న తాపత్రయం, ఆయన సికింద్రాబాద్ ఎంపీ కావడమే దీనికి కారణం. మరో నేత కె.లక్ష్మణ్ కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడే యత్నం చేశారు. వీరంతా తెలంగాణ ఎన్నికల కోసమే ఇలా మాట్లాడుతున్నారన్న సంగతి అర్ధం అయిపోతుంది. 

✍️ మరి ఇదే పార్టీ వారు గతంలో చంద్రబాబుపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారో గుర్తు చేసుకోవాలి. తెలంగాణ బీజేపీ నేతలు గత నాలుగైదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆఆర్‌ను, ఆయన కుమార్తె కవితను ఎన్నిసార్లు జైలుకు పంపుతామని హెచ్చరించారు. కవితను పలుమార్లు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఇంటరాగేషన్‌కు పిలిచింది. తాజాగా కూడా ఈడీ మళ్లీ నోటీసు ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఇది రాజకీయ కక్ష అని అంటున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అంగీకరిస్తారా?. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిని ఎలా పీకేసింది  అంతా చెబుతుంటారు. దానిని కూడా కక్షగానే వీరు ఒప్పుకోవాలి. కేంద్రం రాజకీయ కక్ష కోసం సీబీఐని వాడుతోందని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. 

ఢిల్లీ ఆప్ మంత్రులు కొందరిని బీజేపీ ఎలా అరెస్టు చేయించింది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత శశికళ ఎలా అరెస్టు  అయింది మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తే వీరి అసలు రంగు తెలుస్తుంది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. మంత్రి హరీష్ రావు కాస్త  జాగ్రత్తగానే మాట్లాడారు కానీ.. రాజకీయ లక్ష్యాన్ని వదలిపెట్టలేదని అర్దం అవుతుంది. ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య పోరాటంగా ఆయన చిత్రీకరించారు. అదే సమయంలో చట్టం తన పని చేసుకుపోతుందని అన్నారు. తద్వారా కమ్మ, రెడ్డి వర్గాలు దూరం కాకుండా చూసుకునే యత్నం చేశారనిపిస్తుంది. మరో మంత్రి పువ్వాడ అజయ్ మాత్రం కాంగ్రెస్ నేత రేణుకా చౌదరితో పోటీ పడి చంద్రబాబును సమర్ధించారు. సత్తుపల్లి  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వంటివారు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

✍️కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబును ఉద్దేశించి డర్టియస్ట్ పాలిటీషియన్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్వరం మార్చి  బీఆర్ఎస్ నేతలు కొందరు ఎందుకు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారో ఊహించడం కష్టం కాదు. ఓటు కు నోటు కేసు సమయంలో చంద్రబాబుపై  కేసీఆర్‌తో సహా, బీఆర్ఎస్ మంత్రులు, ఇతర నేతలు  ఏ రకంగా విమర్శలు చేశారో అందరికీ తెలుసు. వివిధ పార్టీలకు చెందిన  వీరంతా కలిసి చివరికి చంద్రబాబును కేవలం ఒక కులానికి సంబంధించిన నాయకుడు మాదిరి ప్రొజెక్టు చేయడం విశేషమే అని చెప్పాలి. ఈ వ్యాఖ్యలు చేసిన నేతలు ఎవరూ స్కిల్  స్కామ్ గురించి ప్రస్తావించకుండా అలా అరెస్టు చేస్తారా? ఇలా చేస్తారా? అని ఏవో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబే హెలికాప్టర్‌లో రానని, తన వాహనంలో రోడ్డు మార్గాన ప్రయాణం చేసిన సంగతి తెలియనట్లు తెలంగాణ పార్టీల నేతలు నటిస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల రాజకీయం కోసమే. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమనడానికి ఇవన్నీ ఉదాహరణలే.


కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

ఇది కూడా చదవండి: అమావాస్యనాడు పవన్‌ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement