పోగాలము దాపురించినప్పుడు ఇలాగే చేస్తుంటారు. రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి.తెలుగుదేశం పరిస్థితి అలాగే తయారైంది. ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా తాము చేసిన కుట్ర ఫలించాయని తెలుగుదేశం పార్టీ నేతలు లోలోపల సంతోషించవచ్చేమో కాని, అదే వారికి రాజకీయంగా ఉరితాడు కాబోతోంది.వచ్చే రెండు నెలలు వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్ పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.ఇది ఏపీ ప్రజలకు శరాఘాతం వంటిదే. తెలుగుదేశం పార్టీ వలంటీర్ల వ్యవస్థపై నిత్యం విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. టీడీపీకి ఏజెంట్ గా మారిన మాజీ ఐఎఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రయోగించి ఈ మేరకు ఉత్తర్వులు తెప్పించారు. రమేష్ వలంటీర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడమే కాకుండా, ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈనాడు రామోజీరావు ఎన్నోసార్లు వలంటీర్ల వ్యవస్థపై విద్వేషం కక్కుతూ వార్తలు రాయించారు.
✍️టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు వలంటీర్లను పలుమార్లు అవమానించారు. వారిని మూటలు మోసే ఉద్యోగం చేసేవాళ్లని, ఆడవాళ్లను ఇబ్బందిపెట్టేవారని ఇలా పిచ్చి ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లను కిడ్పాపర్లుగా అబివర్ణించారు. ఏపీ ప్రజల పట్ల ఏ మాత్రం మానవత్వం లేనివారు, ప్రజల సంక్షేమం కోరుకోనివారు ,దుర్గార్గులు మాత్రమే ఇలాంటి ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తారు. నిమ్మగడ్డ రమేష్ అలాంటి విలన్ పాత్రను పోషించారని చెప్పాలి. కాకపోతే సినిమాలో విలన్ అంతిమంగా ఓడిపోయినట్లే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకోబోతోంది. రమేష్ కుమార్ ఆ పార్టీకి మేలు చేయాలనుకుని ఉండవచ్చుకాని జరగబోయేది కీడే అన్న సంగతి ఇప్పుడు బోదపడుతుంంది. ఈ విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో వారిద్దరూ మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఏకంగా ఏభైవేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేలా చేస్తానని అబద్దపు హామీని కూడా ఇచ్చేశారు. ఇళ్త వద్దకే పెన్షన్ ఇవ్వాలని అంటున్నారు.
✍️మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తమ వర్గం మీడియాను, ఇంకో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి ప్రజా వ్యతిరేకులను ఉపయోగించి వలంటీర్ల వ్యవస్థపై కేసులు వేయించారు.నీచమైన కధనాలు రాయించారు. దీనికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం ఆరంభించారు. అందుకు ప్రాతిపదికగా 2019 లో మొదటి దశలోనే ఎన్నికలు అంటే ఏప్రిల్ పదకుండు కల్లా ఎన్నికలు ముగియగా,ఈసారి అలాకాకుండా ఎన్నికలను నాలుగోదశకు మార్పించడంలో చంద్రబాబు బృందం సఫలం అయింది. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిలో గొడవలను సర్దుబాటు చేసుకోవడం కోసమే ఈ ఏర్పాటు అన్న అభిప్రాయం ఏర్పడింది.అలాగే ఐటి,సీబీఐ వంటి అదికారులు రంగప్రవేశం చేసి తమ వద్ద ఉండే నల్లధనం పట్టుబడకుండా జాగ్రత్తలు పడ్డారనుకోవాలి. అవి చాలవన్నట్లు ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థపై కాటు వేశారు.ఈ మూడు నెలలు వలంటీర్ల సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు.
✍️కాని దీనివల్ల వారికి ఈ ఆదేశమే యమపాశంగా మారబోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దని చెప్పడం వల్ల సకాలంలో వృద్దులకు పెన్షన్ అందే అవకాశం ఉండదు.దీనిపై ప్రజలలో నిరసన వస్తుంది.ఇప్పటికే ఆ నిరసనలను టీడీపీ చవిచూస్తోంది. ఇదంతా తెలుగుదేశం నిర్వాకమని తెలుసుకోవడం కష్టం కాదు. అప్పుడు బలహీనవర్గాల ప్రజలంతా, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీముల లబ్దిదారులంతా తెలుగుదేశంపై మరింత ఆగ్రహం చెందుతారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించినా, హైకోర్టు అబిప్రాయపడినా ఇప్పటికిప్పుడు రెండున్నర లక్షలమందికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని. గ్రామ,వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని అన్నప్పటికీ, వృద్దులంతా ఇబ్బంది పడతారు.దీనికి కారణం ఏమిటని వారు తెలుసుకుని టీడీపీని మరింత అసహ్యించుకుంటారు. వారు పట్టుబట్టి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడే ఆపివేసిన వలంటీర్ల వ్యవస్థను టిడిపి కూటమి అధికారంలోకి వస్తే పూర్తిగా ఎత్తివేస్తారని జనం భావిస్తారు.
✍️అది టీడీపీకి మరింత శరాఘాతం అవుతుంది.అయితే ఈ ఆదేశాలతో తమకు సంబంధం లేదని టీడీపీ చెప్పడానికి యత్నిస్తోంది. అందులో వాస్తవం ఎంతో కొంత ఉందని అనుకోవాలంటే,చంద్రబాబు వెంటనే ఎన్నికల సంఘానికి వలంటీర్ల సేవలను యధావిధిగా కొనసాగించాలని లేఖ రాయాలి. అలా చేస్తారా?చేయరు.పైగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్లు తమ వద్ద ఉన్న సిమ్ కార్డులు,టాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అందచేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది.దీంతో ఒకరకంగా వలంటీర్లకు స్వేచ్చ లబించవచ్చు.వారు తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలలో పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిని లబ్దిదారులంతా ఎందుకు పెన్షన్ రాలేదని అడిగితే ఎటూ టిడిపినే కారణమని చెబుతారు.దానివల్ల ఎవరికి నష్టం జరిగేది ఊహించుకోవచ్చు. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే స్కీమ్ ఒకదానిని కేంద్రం అమలులోకి తెచ్చింది.
✍️అప్పటికే ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కేంద్రం నుంచి అధికంగా గ్యాస్ సిలిండర్లు వచ్చేలా చేసుకున్నారు.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత కొణిజేటి రోశయ్య ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు కాని, చంద్రబాబు ,టీడీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.పేదలకు గ్యాస్ కనెకక్షన్లు ,సిలిండర్లు ఇస్తుంటే కాంగ్రెస్ వారు అడ్డుకుంటున్నారని ఆరోపించేవారు. దానిపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ఇబ్బంది పడేవారు. ఎన్నికల సందర్భంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించేది. కాని దానిని చంద్రబాబు తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. ఆ అంశంతో పోల్చితే వలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం చేసిన నిర్వాకం చాలా పెద్దది. దారుణమైనది.
✍️అప్పుడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్ వల్ల కొన్నివేల మంది మాత్రమే ప్రయోజనం పొందేవారు. కాని ఇప్పుడు వలంటీర్ల వల్ల కోట్లాది మంది ప్రజలు సేవలు పొందుతున్నారు. అలాంటి సేవలపై కక్షకట్టి ఆపేశారన్న విమర్శ సహజంగానే టీడీపీ, చంద్రబాబులపై వస్తుంది. దీనిపై ఆత్మరక్షణలో పడే చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వడానికి సతమతం అవుతున్నారు. ఈలోగా అధికార వైఎస్సార్‌సీపీ ఈ పాయింట్ పై విరుచుకుపడింది. వృద్దులు, బలహీనవర్గాలంటే టిడిపికి గిట్టదని, చంద్రబాబు పెత్తందార్ల ప్రతినిది అని ,అందుకే పేదల పొట్టగొట్టే పని చేశారని ఆరోపించారు. ఏతావాతా టీడీపీకి ముందు నుయ్యి,వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తమకు సంబంధం లేదని అబద్దం చెప్పడానికి యత్నిస్తారు.కాని పలుమార్లు ఆయనతో సమావేశాలు పెట్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయించడం, గతంలో ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు టీడీపీ మద్దతు ఇవ్వడం వంటి ఘట్టాలు జ్ఞప్తికి వస్తాయి.
✍️నిజానికి వలంటీర్ల వల్ల కేవలం పెన్షన్ లే కాదు..అనేక రకాల ఇతర సేవలు కూడా అందుతున్నాయి. అర్హులైన ప్రజలకు ఏదైనా స్కీము వర్తింప చేయదలిస్తే వలంటీర్ కు చెప్పేవారు. వలంటీర్లు వారినుంచి దరఖాస్తు తీసుకుని గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా తగు ఉత్తర్వులు పొంది,వాటిని లబ్దిదారులకు అందచేస్తుంటారు. ఎవరికి పుట్టిన తేదీ సర్టిఫికెట్, కులం ,ఆదాయం తదితర సర్టిఫికెట్లు అవసరమైనవారికి ఇళ్ల వద్దకే తెచ్చి ఇస్తుంటారు.ఇప్పుడు వాటన్నిటికి బ్రేక్ పడుతుంది.ఇప్పుడే ఆపేసి ప్రజలందరిని ఇబ్బందులకు గురి చేసినవారు ,ఎన్నికల తర్వాత ఏమి చేస్తారో అన్న సందేహం వస్తుంది. ఇవన్ని టీడీపీకి నష్టం చేసే అంశాలే అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసభ ఎన్నికల తరుణంలో తెలుగుదేశం పార్టీ తనకు తానే ఉరితాడు పేనుకుని మరీ తన మేడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకోబోతోందన్న భావన కలుగుతుంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment