ఆంద్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చూడండి. ఇక మీడియా పరిస్థితి అయితే నానాటికి నాసిరకంగా మారుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఓటు అమ్ముకుంటే, అమ్ముకున్నవారిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చేవి. చివరికి ఓటును విక్రయించారన్న ఆరోపణలు ఎదుర్కునేవారు సిగ్గుతో తలవంచుకునే విధంగా వార్తా కథనాలు ఉండేవి.
కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో గమనించండి. ఓటు అమ్ముకున్నవారికి మద్దతుగా పేజీలకు, పేజీల వార్తలు వండి వార్చుతున్నారు. అబ్బో.. తాము విలువలకు కట్టుబడి ఉన్నామని పోజులిచ్చిన రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అయితే మరీ అరాచకంగా తయారైంది.
ప్లేట్ పిరాయించిన ఈనాడు
జర్నలిజాన్ని గాలికి వదలివేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలాగోలా వ్యతిరేకత పెంచాలన్న నీచ మనస్తత్వంలో ఉన్న ఈనాడు పత్రిక పూర్తిగా దిగజారిపోయినట్లు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటోంది. ఏపీలో ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన విషయాన్ని ఆ పత్రికే కథనాలుగా ఇచ్చింది.
దానిపై డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో తెలుగుదేశం పార్టీ ఇరుకునపడింది. అంతే .. ఈనాడు కూడా ప్లేట్ పిరాయించేసింది. తాము వైఎస్సార్‌సీపీకే ఓటు వేశామని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెబితే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇచ్చారు. అంతేకాక ఆ ఎమ్మెల్యేలు నలుగురు ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తే దానిని పటం కట్టి ప్రచురించారు.
అంతే తప్ప.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నదానిపై వార్తలు ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, భూతద్దంలో వెదికి రాసే ఈనాడుకు ఇంత పెద్ద డీల్ గురించి తెలియకపోవడం అంటే వారి అసమర్దత అనుకోవాలా? లేక అవినీతిని సమర్ధించడం అనాలా? తనకు కూడా టీడీపీ డబ్బు ఆఫర్ ఇచ్చిందని, తాను ఒప్పుకుంటే పది కోట్లు వచ్చి ఉండేవని, తనకు సిగ్గు,శరం ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేదని చెప్పిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనను మాత్రం ఒక చిన్నపేరాగా ఎక్కడో లోపల పేజీలో కనబడి, కనబడనట్లుగా ప్రచురించారు. దీనిని బట్టి ఈనాడు అవినీతిపరుల వైపు నిలబడడానికి కంకణం కట్టుకుందని తేలడం లేదా!
పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు..
వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వాదన ఇవ్వదలిస్తే ఇవ్వండి.. తప్పు లేదు. కాని అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరం గురించి మరో ఎమ్మెల్యే చేసిన ప్రకటనకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి కదా! అలాగే వాస్తవం ఏమిటో పాఠకులకు తెలియచేయాలి కదా! తను భుజాన వేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే అది ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమర్దతగా, చాతుర్యంగా అభివర్ణించే అధమస్థాయి ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5వంటి మీడియా సంస్థలు రావడం అత్యంత హేయంగా కనిపిస్తుంది.
అదే పని కనుక మరే పార్టీ అయినా చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈ ఎల్లో మీడియా కాని గగ్గోలుగా ప్రచారం చేసి ఉండేవారు. తమకు పదహారు మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నాయకత్వం చెబితే అది గొప్ప విషయంగా ఈ మీడియా భావించింది. అంతే తప్ప.. అదేమిటి? అలాంటివాటిని ఎందుకు ప్రోత్సహిస్తారు.. అని ప్రశ్నించలేదు. గతంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గబ్బు పట్టిన తెలుగుదేశానికి ఇంకా గుణపాఠం రాకపోవడంపై ఆ మీడియా ప్రశ్నించలేదు. పైగా బలం లేకపోయినా టిడిపి అభ్యర్ది గెలిచారంటూ చంకలు గుద్దుకుంటూ ఈ మీడియా సంబరపడిపోయింది.
సుద్దులు చెప్పి.. ఇప్పుడేంటి ఇంత దారుణంగా..
రామోజీరావు విలువల గురించి ఎన్ని సుద్దులు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యేల తీరుతెన్నుల గురించి ధర్మోపన్యాసం చేసిన రామోజీరావు ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలకు మద్దతు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నారు. మరో మీడియా అధినేత గురించి చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఇలాంటి బ్రోకర్ పనులు చేయడంలో ఆయన ఆరితేరారని ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నదే. ఈసారి కూడా ఆయన తన వంతు పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఆయనను పెద్దగా సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కాని ఈనాడు మీడియా మోసపూరిత విధానాలపై మాత్రం మాట్లాడుకోక తప్పదు.
సస్పెండైన ఎమ్మెల్యేలు ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు నలుగురు కూడా తాము వైఎస్సార్‌సీపీ సూచించిన అభ్యర్దులకే ఓటు వేశామని చెబుతుండడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. మీడియా ముందు తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెబితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. పైగా వీరు డబ్బుకు అమ్ముడుపోయారన్నది నిర్ధారణగా మారి ప్రజలు మరింత ఈసడించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తాము అమ్ముడుపోలేదని చెప్పుకుంటూనే వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నారు.
నిజంగానే వీరు పార్టీకి ద్రోహం చేయకుండా ఉన్నట్లయితే , తాము ఎక్కడా పొరపాటు చేయలేదని, పార్టీ తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందని చెప్పేవారు. కాని వారిలో ఆ ధైర్యం కొరవడింది. అపరాధ భావనను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అయినా ఆనం రామనారాయణరెడ్డి తనకున్న రాజకీయ అనుభవంతో బాగానే నటించగలిగారు.
ఆయన మొన్నటిదాకా సీఎం జగన్‌ను ఎలా మెచ్చుకున్నారు? ఇప్పుడు ఎంత ఘోరంగా విమర్శిస్తున్నారు? 2014లో రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ వైపునకు వెళ్లి, ఆ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారేమో తెలియదు కాని, 2019 ఎన్నికల నాటికి వైఎస్ జగన్‌ను ఆశ్రయించి వెంకటగిరి టిక్కెట్ పొందారు. ఆ కృతజ్ఞతను కూడా ఆనం మిగుల్చుకోకపోవడం విషాదం.
తండ్రి దారిలోనే ఆనం...
ఆనం ఇంతవరకు మూడుసార్లు టీడీపీలోకి ,రెండుసార్లు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలోకి మారారు. తమకు ఎంతో చరిత్ర ఉందని ఆయన చెబుతున్నారు. నిజమే..ఆయన తండ్రి ఆనం వెంకటరెడ్డికి కూడా ఇలాగే ఫిరాయింపులు చేసిన చరిత్ర ఉంది. దానిని రామనారాయణ కూడా అనుసరిస్తున్నట్లుగా ఉంది. వచ్చేసారి బీజేపీ, జనసేన, టీడీపీ లలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో కాని, బయటకాని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగనన్న అంటూ ఎన్ని కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
అమరావతి రాజధాని గురించి ఇంతకాలం ఏమి మాట్లాడింది.. ఇప్పుడు ఏమి మాట్లాడుతోంది.. వింటే నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందంటే ఇదేనేమో అనిపిస్తుంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వెలుగులోకి వచ్చాయి. ఈమె తన ఓటును టిడిపికి వేయడానికి ముందుగా ఎవరెవరి ద్వారా రాయబారాలు సాగించారన్న అంశంపై కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బయటపడిపోయినందున ఆయన ఏమన్నా పట్టించుకోనవసరం లేదు. మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై ఇటీవలికాలంలో వచ్చిన ఆరోపణలు, దానికి ఆయన ఆత్మరక్షణలో పడిన తీరు మొదలైనవి చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా, జనం నమ్మే పరిస్థితి లేదు.
వీరంతా ఒక వైపు తాము వైసిపికే ఓటువేశామని చెబుతూనే , మరో వైపు వైసిపిని విమర్శిస్తున్న వైనాన్ని బట్టి వీరు ఏమి చేసింది అర్ధం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయ నేతలు విలువలు పాటించడం లేదని సంపాదకీయాలు రాసే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు సైతం అంతకన్నా ఘోరంగా , చివరికి అమ్ముడుపోయారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వడం జర్నలిజం విలువలను నిలువెత్తు గోతిలో పాతిపెట్టడమే.రాపాక వరప్రసాద్ చెబుతున్నట్లు ఈ మీడియా కూడా సిగ్గు,శరం వదలివేశాయని అనుకుంటే తప్పేముంటుంది?
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment