ఈనాడు అధినేత రామోజీరావు తెగబడుతున్నారు. చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్క అన్నారంటే ఆయనలోని అహంకారం, విద్వేషం ఏ రకంగా నురగలు కక్కుతోంది ఇట్టే తెలిసిపోతుంది. గత కొన్నాళ్లుగా ఆయన ఎపి ప్రభుత్వంపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన అప్రకటిత అధర్మయుద్దం చేస్తున్నారు. ఎన్ని దారుణాలు చేసి అయినా, ఎన్ని అసత్యాలు రాసి అయినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు తాలిబన్ల రాజ్యం అని సంపాదకీయం రాస్తారు. మరో రోజు వైసిపి వలంటీర్లు అని మరో దిక్కుమాలిన ఎడిటోరియల్ రాస్తారు.
దురహంకారం పరాకాష్టకు
తాజాగా అమ్మకానికి అమరావతి అంటూ అద్వాన్నమైన సంపాదకీయం రాశారు. ఈనాడు రిపోర్టర్లు రాసే అబద్దాలు, అర్దసత్యాలతో ఆయన సంతృప్తి చెందక, స్వయంగా రంగంలో దిగుతున్నారని అనుకోవాలి. అందువల్లే వృద్దాప్యంలో ఉండి కూడా ఆయన ఉచ్ఛనీచాలు మర్చిపోతున్నారు. ఏభై శాతం పైగా ఓటర్లు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, 151 సీట్లతో అసాధారణ విజయం సాధించిన ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్క అన్నారంటే ఎంత దురహంకారం ఉండాలి. ఆయన రాసిన సంపాదకీయాలు నాసి రకంగా ఉండడమే కాదు.. ఎవరైనా గంజాయి తాగితేకాని అలా రాయలేరన్న చందంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు.
ముఖ్యమంత్రి జగన్‌ను గంజాయి మొక్క అనడం ద్వారా రామోజీరావు రాక్షసానందం పొంది ఉండవచ్చు. కాని అదే సమయంలో ఆయన జర్నలిజంలో ఒక గంజాయి తోట పెంచుతున్నారని, ఆ తోటలో ఈనాడును ఒక పెద్ద గంజాయి మొక్కగా తయారు చేసి, చిన్న గంజాయి మొక్కలతోటి ఇలాంటి చెత్త సంపాదకీయాలు రాయిస్తున్నారని ఎవరైనా అనుకుంటే తప్పేం ఉంటుంది. విలువలు, ప్రమాణాలకు పాతరేసి జనాన్ని మోసం చేయడానికి, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని మోయడానికి ఆయన పడరాని పాట్లు పడుతున్నారని తెలుసుకోవడం కష్టం కాదు.
ఈ ప్రశ్నలకు బదులేది రామోజీ
అమరావతి ప్రాంతంలో ఎక్కడో ఒక చోట 14 ఎకరాల భూమిని అదికారులు అమ్మకానికి పెట్టారట. అంతే! రామోజీలో దురహంకారంతో కూడిన ఆవేశం బుసలు కొట్టింది. ఇప్పటికే ఆంద్ర ప్రదేశ్ పాలిట కాలనాగు మాదిరి తయారైన ఆయన ఎక్కడా ఒక అభివృద్ది జరగడానికి వీలు లేకుండా అడ్డుపడుతున్నారు. రాజధానికి సంబంధించి హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందట. శాసనసభకు చట్టం చేసే హక్కు లేదని చెబితే ఈయనకు చారిత్రాత్మకంగా కనిపించింది. అనుకున్నట్లు అమరావతి రాజధాని సాకారమైతే అది కామధేనువు అయ్యేదట.
అచ్చంగా తెలుగుదేశం నేత మాదిరే రాశారు తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడే సందేహం వస్తుంది. రామోజీకి , ఆయన మనుషులకు ఇది కామధేనువుగా మారి ఉండేదేమో! నిజంగానే అంత సీన్ ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు తాత్కాలిక భవనాలు నిర్మించారు? ఎందుకు శాశ్వత భవనాలు కట్టలేదు? అసలు ఒక ప్రధాన రహదారిని అయినా పూర్తి చేయలేదే? చివరికి తాను ఉండే కరకట్ట రోడ్డును కూడా అభివృద్ది చేయలేదే? రాజధాని కట్టడానికి లక్షతొమ్మిది వేల కోట్లు కావాలని కేంద్రానికి ఎందుకు చంద్రబాబు లేఖ రాశారు?
చంద్రబాబు, రామోజీరావులు ఇప్పుడు చెబుతున్నట్లు అది స్వయం సిద్దమైనది అయితే అప్పుడు కేంద్రాన్ని ఎందుకు డబ్బు అడిగారు. కేంద్రం తాము ఇవ్వలేమని తేల్చేసింది కదా? అది సెల్ఫ్ పైనాన్సింగ్ అంటే భూములు అమ్మి సంపాదిస్తామని ఆనాడే చెప్పారు కదా? ప్రస్తుతం ఏదైనా చిన్న పనికి భూమి అమ్మబోతే ఎందుకు రామోజీ అడ్డుపడుతున్నారు? అదేదో న్యూయార్క్ లోని ఒక పత్రిక భవిష్యత్తు నగరాలలో ఇది ఒకటి అని రాసిందట. అంతే ఈనాడు, మరికొన్ని టిడిపి పత్రికలు బట్టలు చించుకున్నాయి.
అంటే ఒక బొమ్మ గీసి ఇదే భవిష్యనగరం అని అనుకొమ్మంటే జనం పిచ్చివాళ్లా? ఎపి ప్రజల మొత్తం పన్నుల డబ్బును అమరావతిలో ఖర్చు చేస్తే కొన్ని వందల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితే పడి ఉండవచ్చు. కాని కోట్లాది మంది పేదలకు జరిగే మేలు ఏమిటి? అసలు ఆ నగరం నిర్మాణానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? దేశంలో కొత్త నగరం ఏదైనా ఆ స్థాయిలో నిర్మించారా. గుజరాత్, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో ఎంత వ్యయంతో కొత్త రాజధానులు కట్టారో రామోజీకి తెలియదా?
ఈనాడు అప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా
ముక్కారు పంటలు పండే భూములను రైతులు స్వచ్చందంగా ఇచ్చారట. అసలు మూడు పంటలు పండే భూములను ఇలా రాజధాని పేరుతో ప్రభుత్వం తీసుకోవచ్చా? ఆ రోజుల్లో భూములు ఇవ్వడానికి ఇష్టపడనివారిపై ఎన్నిరకాల వేధింపులు జరిగాయో తెలియదా? అవును గంజాయి తాగి సంపాదకీయాలు రాసేవారికి అవేవి కనిపించవు కదా! టిడిపి ప్రభుత్వమే ఆనాడు పంటలను దగ్దంచేయడానికి పూనుకుందన్న ఆరోపణలు అవాస్తవమా? ఉండవల్లి,పెనుమాక వంటి గ్రామాల రైతులు ఎన్ని బాధలు పడింది వీరు గుర్తించరా?
ఇవేమి జరగకపోతే ఆనాడు జనసేన అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ గ్రామాలలో పర్యటించి వారికి అనుకూలంగా మాట్లాడారు? మూడు పంటలు పండే భూములను తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కితే ఈనాడు గంజాయి మత్తులో మునిగితేలిందా? ఒకప్పుడు శ్రీసిటీ పరిశ్రమల స్థాపనకోసం పెద్దగా పంటలు పండని భూములను సేకరిస్తే అమ్మో .. వ్యవసాయ భూములు తీసుకుంటారా? అని రాసిన ఈనాడు పత్రిక, రాజధానికోసం మూడు పంటలు పండే భూములు తీసుకోవడం సమర్ధనీయమని అంటోంది.
పైగా ఆసాములు ఉదారంగా భూములు ఇచ్చారట. అదేమిటి? మంచి ప్యాకేజీతో పాటు ఏటా ఎకరాకు ఏభైవేల రూపాయల కౌలును కాణీ ఖర్చు లేకుండా తీసుకుంటున్నారు కదా? అభివృద్ది చేసిన ప్లాట్లు తీసుకుంటే అది ఉదారం అవుతుందా? ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు, రైతులు పాదయాత్ర చేస్తుంటే వైసిపి మందలు దాడులు చేశాయట. ఏమి రాతలో చూడండి. గుడివాడ వెళ్లి కొందరు మహిళలు కారు ఎక్కి మరీ తొడలు కొట్టారే?
వారి ఆస్తులు పెరిగితే రాష్ట్రం బాగుపడినట్లా
రామచంద్రపురం వద్ద రైతులను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఐడి కార్డులు చూపాలని అడిగితే పట్టుమని పది మంది లేకుండాపోయారే? నిజంగా రైతులు అయితే తమ యాత్ర కొనసాగించేవారు కదా? ఎవరు అడ్డుకుంటారు? రాజధాని గ్రామాలలో అప్రజాస్వామిక రాజ్యం నడుస్తోందట. అది నిజమే అయితే రైతుల పేరుతో అక్కడ నిత్యం ధర్నాలు ఎలా చేయగలుగుతారు? జగన్ సర్కార్ కు ఎలాంటి శిక్ష వేస్తారో ప్రజలే నిర్ణయిస్తారట. అమ్మ ఒడి పేరుతో, స్కూళ్లలో నాడు-నేడు పేరుతో విద్యారంగాన్ని అభివృద్ది చేస్తున్న జగన్ కు ప్రజలు శిక్ష వేయాలట. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, చేయూత స్కీమ్, చేనేత నేస్తం, కాపు నేస్తం, అనేక స్కీములు అమలు చేస్తూ, మరో వైపు పరిశ్రమల రంగంలో విశేష అభివృద్దికి కృషి చేస్తున్న జగన్ కు శిక్ష వేయాలని గంజాయి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు?
రామోజీ, చంద్రబాబు వంటివారు కేవలం తమ ఆస్తుల విలువ పెరిగితే రాష్ట్రం బాగుపడినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదలను ఆదుకునే స్కీములు అమలు చేస్తే రాష్ట్రం విధ్వంసం అయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగానే రామోజీ దుష్టచతుష్టయంలో ఒకరిగా రుజువు చేసుకుంటున్నారు. అంతేకాదు జగన్ చెబుతున్నట్లు.. వచ్చేది పేదలు, పెత్తందార్ల మద్య యుద్దమే. రామోజీ ఒక పెత్తందారు అయితే, జగన్ పేదల తరపున ప్రతినిధిగా పోరాడుతున్నారు. పెత్తందార్లు ఎల్లవేళలా గెలవలేరని చరిత్ర చెబుతోంది. గంజాయి మత్తులో ఉన్నవారికి ఆ విషయం తెలియడానికి ఇంకా సమయం పడుతుంది కదా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment