సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసగించారని.. ఎన్నోఏళ్ల కల అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టి, చిన్న వ్యాగన్ రిపేర్ షాప్‌కు శంకుస్థాపన చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ఏజెన్సీలు దృష్టిపెట్టాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి ఉడత ఊపులు, పిట్ట బెదిరింపులకు కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ ప్రజలు 45ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ ఎగనామం పెట్టారు. రూ.20వేల కోట్ల విలువైన ఫ్యాక్టరీని తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు మోసపూరితంగా తరలించుకుపోయారు. సబ్‌కా సాత్ – సబ్‌కా వికాస్ అనే నినాదం గుజరాత్‌కా సాత్, గుజరాత్‌కా వికాస్‌గా మారిపోయింది.
తెలంగాణ గత తొమ్మిదేళ్లలో కోరిన దేన్నీ కేంద్రం మంజూరు చేయలేదు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పా టు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునః ప్రారంభంతోపాటు జాతీయ రహదారి ప్రాజెక్టులు, నూతన రైల్వే లైన్లు, ఉన్న రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టారు.
మోదీవన్నీ అసత్యాలే..
ప్రధాని పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగింది. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం పరిపాటైంది.
దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగాన్ని పెంచిన ప్రధాని మోదీని ఉద్యోగాలపై ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అంటూ అవహేళన చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న సుమారు 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధాని.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడటం గురవింద గింజ సామెత కన్నా హీనంగా ఉంది.
అన్ని వర్గాలకూ అన్యాయమే..
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని గతంలో బీజేపీ నేత, ప్రస్తుత గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టిన విషయంపై ప్రధాని స్పందించకుండా ఖాళీల గురించి మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలు ప్రధానికి కనిపించలేదా? తెలంగాణ ప్రభుత్వ బడుల వ్యవస్థ గురించి అసత్యాలు మాట్లాడారు.
వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల మరణాలకు కారణమైన ప్రధాని ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం గురించి ప్రస్తావించిన ప్రధానికి.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇవ్వాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తొక్కిపెట్టిన విషయం తెలియదా?
కుటుంబపాలన అంటే నవ్వుతారు
ప్రధాని మోదీ కుటుంబ పాలన గురించి మాట్లాడటం దారుణం. అనేక రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల నుంచి తన కేబినెట్లో మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారేనన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment