తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం | KTR Fires On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం

Published Wed, Apr 12 2023 3:29 AM | Last Updated on Wed, Apr 12 2023 7:23 AM

KTR Fires On PM Narendra Modi - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్న బయ్యారం ఉక్కు కర్మాగారానికి బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం కేటాయించకుండా తన మిత్రుడు అదానీకి కట్టబెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదానీకి కట్టబెట్టిన ఆ మైనింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

150 కి.మీ దూరంలోని బయ్యారానికి, 600 కి.మీ దూరంలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం లాభసాటి కానప్పుడు..1,800 కి.మీ దూరంలోని గుజరాత్‌లోని ముంద్రాలో నిర్మించే ఉక్కు పరిశ్రమకు ఏ విధంగా లాభసాటి అవుతుందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, భానుప్రసాద్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. 

కుట్రలు గమనించలేక పోయాం.. 
‘బయ్యారం, విశాఖ రెండింటికీ ముఖ్యమైది బైలదిల్లా. 134 కోట్ల మెట్రిక్‌ టన్నుల గని. బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలు నిర్మిస్తామని ఏపీ పునరవ్వ్యస్థీకరణ చట్టంలోనే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బయ్యారం కోసం 2014 నుంచి అడుగుతోంది. పరిశ్రమల మంత్రిగా నేను ప్రధానమంత్రిని 2018 జూన్‌లో కలిసి విజ్ఞప్తి చేశా. సీఎం కేసీఆర్‌ కూడా లేఖలు రాశారు. అయితే బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత తక్కువ అంటూ తప్పుదోవ పట్టించారు.

వారు చెప్పిందే నిజం అనుకున్నా. ‘‘బయ్యారానికి కేవలం 150 కి.మీ దూరంలోపి బైలదిల్లాలో నాణ్యత గల ఇనుప ఖనిజం ఉంది. అక్కడ నుంచి స్లర్రీ పైపు లైను వేయవచ్చు. అందుకయ్యే వ్యయంలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం కేటాయించి, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే 15 వేల నుంచి 20 వేల మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది..’’అని ప్రధానికి చెప్పా. కానీ వారి కుట్రలు గమనించలేకపోయాం. మేము అడిగి వచ్చామో లేదో 2018 సెప్టెంబర్‌లో అదాని బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ కంపెనీని పెట్టారు. బైలదిల్లా అదాని చేతుల్లోకి వెళ్లింది..’అని కేటీఆర్‌ వివరించారు. 

‘విశాఖ’ను అమ్మడానికి కేంద్రం కుట్ర..     
‘విశాఖ ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైనింగ్‌ ఇవ్వకుండా నష్టాల్లోకి వెళ్లేలా చేసి, దానిని అడ్డికి పావుశేరు లెక్కన అమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తోంది. అదానీకి రూ.6 లక్షల కోట్ల విలువైన బైలదిల్లాను కట్టబెట్టడమే కాకుండా.. రూ. 1.5 లక్షల కోట్ల విలువైన విశాఖ కర్మాగారాన్ని కూడా కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిస్తూ.. పాస్కో విశాఖ కర్మాగారాన్ని చూసిందని, అక్కడ పరిశ్రమ పెట్టే యోచన చేస్తోందని చెప్పింది. కానీ దానిని గుజరాత్‌కు మళ్లించారు. ఇలా రెండు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు..’అని మంత్రి ధ్వజమెత్తారు.  

బండి సంజయ్‌ ఓ అజ్ఞాని.. 
‘బయ్యారం ఉక్కు పరిశ్రమను పట్టించుకోకుండా విశాఖ ఉక్కుపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆయనకు విషయ పరిజ్ఞానం లేదు. ఓ అజ్ఞాని. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఫీజబులిటీ లేదు అంటాదు. అక్కడ నాణ్యత లేదంటాడు. ప్రధాని, ఆదాని, అజ్ఞాని.. ఓ డెడ్లీ కాంబినేషన్‌. ప్రధానులు ఎవరైనా ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కానీ ఈ ప్రధాని జాతి సంపదను తన జాతి రత్నాలకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, పోర్టులను కట్టబెట్టారు..’అని కేటీఆర్‌ ఆరోపించారు.  

బిడ్డింగ్‌ సాధ్యాసాధ్యాల పరిశీలనకే విశాఖకు.. 
‘విశాఖపై అధ్యయనం మాత్రమే చేస్తున్నాం. క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకుండా సాధ్యం అవుతుందా లేదా..? బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికే అధికారులు అక్కడికి వెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇచ్చిన తరువాతే ఒక నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్‌ తెలిపారు. రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నడిపిస్తామంటే నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి, అందుకోసం రూ.250 కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఇప్పటికీ సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్‌ను తెరిపించామని, బిల్ట్‌ను తెరిపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement