తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు: కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | KTR Interesting Comments On Telangana Politics | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కాలేదు.. రాహుల్ గాంధీ సభకు రాలేదు: కేటీఆర్‌ సెటైర్లు

Published Thu, Aug 15 2024 3:00 PM | Last Updated on Thu, Aug 15 2024 4:36 PM

 KTR Interesting Comments On Telangana Politics

సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తొందరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక రాబోతుంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ తరఫున రాజయ్య గెలవబోతున్నారు. అలాగే, తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు వస్తాయి.. అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ తాజా మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ మార్పాక రవి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్‌. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయం. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో రాజయ్య విజయం సాధించబోతున్నారు. కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చెప్పారు. పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చూస్తున్నాం. మూడు ఉప ఎన్నికలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కేసు హైకోర్టులో నడుస్తుంది. ఇతర పార్టీల్లోకి వెళ్లిన మంచి నాయకులు మళ్ళీ తిరిగి వస్తున్నారు. 2014లో 63 సీట్లు, 2018లో 86 సీట్లు, మొన్న మనకు 39 సీట్లు వచ్చాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి, మోదీతో కలిసి లేని వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు. కేరళలో సీపీఎం గెలవలేదు. తమిళనాడులో సీపీఎం మద్దతు తెలిపితే గెలిచింది. దేశం మొత్తం నిట్టనిలువునా చీలింది. ఏ కూటమిలో లేని వాళ్లు ఒక్క సీటు కూడా గెలవలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు మేము అందరం మోస పోయాం. కరెంట్ పోతే తొండలు, ఉడుతలు పడ్డాయని ప్రకటన చేస్తున్నారు. ఊసరవెల్లులు ఉన్న రాష్ట్రంలో తొండలు, ఉడుతలు రావటం కామన్.

30వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. యువత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైఖరి చూస్తున్నారు. నిరుద్యోగులు తిరగబడుతున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కోసం ప్రశ్నిస్తున్నారు నిరుద్యుగులు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?. జాబ్ క్యాలెండర్ కాదు.. మొన్న వాళ్ళు ఇచ్చింది జాబ్ లెస్ క్యాలెండర్. ఇప్పటి వరకు రైతుబంధు(రైతుభరోసా)కే దిక్కులేదు. రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని అన్నారు చేయలేదు. రుణమాఫీ కాలేదు.. రాహుల్ గాంధీ సభకు రాలేదు. బోనస్ ఇస్తామని చెప్పాడు. సన్న వడ్లకే అని మళ్ళీ మాట మార్చాడు రేవంత్ రెడ్డి. సన్న వడ్లకు నువ్వూ ఇచ్చేది ఏంది?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని అన్నాడు. రేవంత్ రెడ్డికి బంగారం షాపు వాడు తెలుసో లేదో. బస్సుల్లో అల్లం వెల్లుల్లి ఓల్చితే తప్పా అని మంత్రి సీతక్క అంటున్నారు. మేము వద్దు అనలేదు కదా. మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి.

కేసీఆర్ ఉన్నప్పుడు బస్సుల్లో ఏనాడైనా ఆడబిడ్డలు కొట్టుకున్నారా?. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబం కనిపించటం లేదా. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి తమ్ముళ్ల ఫొటోలు కనిపిస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం. వెళ్లిన నేతల గురించి ఆలోచన వద్దు.

ఎమ్మెల్సీ కవిత అన్నగా చెల్లెను కలిస్తే బీజేపీ వాళ్ళ కాళ్లు మొక్కాడని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మాకేం అవసరం. బీజేపీలో పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇంకో 50ఏళ్లు పార్టీని బ్రహ్మాండంగా నడుపుకుంటాం. త్వరలోనే పార్టీ పదవులు కూడా ఇస్తాం. నియోజకవర్గాల వారీగా కేసీఆర్ కలుస్తారు. ముందు స్టేషన్ ఘన్‌పూర్ వాళ్లనే కలిపిస్తాం అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement