తెలంగాణ కోసం చస్తాను తప్ప తలవంచేది లేదు
మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగారు
ఫార్ములా–ఈ వ్యవహారంలో పైసా అవినీతి లేదని చెప్పినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలవంతంగా పెట్టించిన కేసులో విషయం ఏమీ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు 82 ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. తెలంగాణ ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా నిబద్ధతతో, పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశా అని చెప్పా. ఏసీబీ మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.
ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఏడాది కాలంగా లగచర్ల, హైడ్రా, విద్యుత్ చార్జీల పెంపు వంటి అనేక అంశాలపై కొట్లాడుతున్నాం. కేసులు పెట్టి మా కేడర్, ప్రజల దృష్టిని రేవంత్ మళ్లించలేరు. అవసరమైతే తెలంగాణ కోసం చస్తాను తప్ప ఇలాంటి కేసులకు తలవంచేది లేదు..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో విచారణకు హాజరైన కేటీఆర్.. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉదయం విచారణకు వెళ్లే ముందు నందినగర్ నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు.
అణా పైసా అవినీతి లేదని చెప్పా
‘తెలంగాణకు పెట్టుబడులు తేవడం, ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలనే దూరదృష్టితో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఫార్ములా ఈ రేస్‌ను తెచ్చానని చెప్పా. ఇందులో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేశా. అలాంటి గలీజు పనులు చేయడం రేవంత్‌కు అలవాటు అని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇక్కడ నుంచి డబ్బులు పంపాం.. డబ్బులు అందినట్లు ఎఫ్‌ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) వాళ్లు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చెపితే ఏసీబీ అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ ఇతరులను కూడా పంపి పైశాచిక, శునకానందం పొందాలని చూస్తున్నాడు. రేవంత్ తరహాలో నేను లుచ్చా పనులు చేయలేదు. కేబినెట్‌లో ఉంటూ లాండ్ క్రూజర్లు కొనుగోలు చేయలేదు. బావ మరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు ఇవ్వలేదు. రేవంత్ తరహాలో డబ్బు సంచులతో దొరకలేదు. పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలు తిరిగా. రేవంత్ పెట్టే కేసులకు భయపడేవారెవరూ తెలంగాణలో కానీ బీఆర్‌ఎస్‌లో కానీ లేరు..’ అని కేటీఆర్ అన్నారు.
రేవంత్‌ను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదు
‘ఇదొక లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం. రాష్ట్రంలో రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. తనను గుర్తించని వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నడు. ఏడాది తర్వాత కూడా ఆయనను ఎవరూ సీఎంగా గుర్తు పట్టకపోతే నేనేం చేయాలి. కేసులకు భయపడేది లేదు, బాధపడేది లేదు. లేని అవినీతిని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతుంది? ఏసీబీకి రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపితే తిరిగి పిలుస్తారేమో. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాదంతా రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఉంటాం. ఎంత కొట్టినా రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టం వస్తే మేమున్నామంటూ వచ్చిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment