సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ ఢిల్లీకి నిధులు పంపించడంలో బిజీగా ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జల వనరులను తరలించడంపై సీఎం రేవంత్‌కు అసలు శ్రద్ధ లేదని అన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయని చెప్పుకొచ్చారు.
కాగా, కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అసమర్థ ముఖ్యమంత్రికి డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదు. సాగునీరు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యాయి.
ఇది ప్రకృతి కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత ఇది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలి. హైదరాబాద్ చుట్టూ ప్రాజెక్ట్‌ల్లో నీళ్లు ఉన్నా.. నగరంలో నీటి ఎద్దడికి కారుకులు ఎవరు?. మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్నారు. మంచి నీళ్లు మహాప్రభో అంటూ ప్రజలు అల్లాడుతున్నారు. రేవంత్ మాత్రం గొంగు చించుకుని తిడుతున్నారు. 2023లో నవంబర్‌లోనే మేము స్పష్టంగా చెప్పాము. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని. కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తాం.
కాంగ్రెస్‌కు హైదరాబాదీలు ఓటు వేయదు. అది అందరికీ తెలుసు.. అందుకే హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టావా రేవంత్?. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీగా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తాం. ఘన్‌పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయం. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు. అలాగే, ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదని మళ్లీ చెబుతున్నాను. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము.. తాట తీస్తాం. నేను ఎవరికీ భయపడను అని వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment