గత 24 ఏళ్లలో కేసీఆర్‌ను అంతం చేస్తామన్నవారు ఎక్కడున్నారో చూడు: కేటీఆర్
కేసీఆర్ తెలంగాణ తేకపోతే నువ్వా సీట్లో ఉండేవాడివా?
ఎత్తు కుర్చిలు వేసుకున్నంత మాత్రాన పెద్దోడివి అయిపోవు
ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి.. అది ఒక్క కేసీఆర్‌కే సొంతం
సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్లు పెట్టి మోసం చేశారు
గాడ్సే వారసుడు గాంధీ విగ్రహం పెడతాడట అని వ్యాఖ్య
బీఆర్‌ఎస్‌లో చేరిన రాజేంద్రనగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ నేతలను స్వాగతించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను అంతం చేస్తామని గత 24 ఏళ్లలో ఎంతో మంది పిచ్చి ప్రేలాపనలు చేశారని.. వారంతా ఎక్కడున్నారో చరిత్రలోకి తొంగిచూస్తే రేవంత్‌రెడ్డికి తెలుస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నడుము బిగించకపోతే ఇవాళ సీఎంగా రేవంత్‌రెడ్డి ఉండేవారా? అని ప్రశ్నించారు. అధికారం, పదవు లు తాత్కాలికం, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవడం ఒక్కటే శాశ్వతమని.. అది కేసీఆర్‌కు మాత్రమే సొంతమని చెప్పారు.
శనివారం రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్, వారి అనుచరులు తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీ ఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డికి కొన్ని సాంకే తిక సమస్యలు ఉన్నాయి. ఎత్తయిన కుర్చీలు, లేదంటే రెండు కుర్చీలు వేసుకు ని కూర్చుంటున్నారు. ఎత్తయిన కుర్చీలో కూర్చుంటే పెద్దోడివి అయిపోవు రేవంత్‌రెడ్డీ.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి.
కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు. బీఆర్‌ఎస్ అంటే సామాన్య శక్తి కాదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల ప్రజల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ పాలన సాగించారు. అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పదవుల కోసం పార్టీని వదిలిపోయినా.. పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న గులాబీ సైనికులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
దేవుళ్లను మోసం చేసిన తొలి వ్యక్తి రేవంత్..
సీఎం రేవంత్ రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తా అన్నారు. దాని కోసం రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తోంది. మూడు పంటలకు రైతు భరోసా ఎక్కడ పోయింది. వానాకాలం రైతుబంధు ఇంకా ఖాతాల్లో పడలేదు. మోసపోయామని రైతు లు బాధపడుతున్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా మని చెప్పి మోసం చేశావు.
రేవంత్ ఏ దేవుడి వద్దకు వెళ్తే అక్కడ ఒట్లు పెట్టారు. మనుషులను మోసం చేసిన వారున్నారు. కానీ దేవుళ్లను మోసం చేసిన తొలి వ్యక్తి రేవంతే. పంద్రాగస్టులోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీశ్‌రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది రుణమాఫీ? జేపీ దర్గా వద్ద కూడా ఒట్టు పెడితివి. నీ ఒట్లకు మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు.
గాడ్సే వారసుడు గాంధీ విగ్రహం పెడతాడట!
మూసీ గురించి మేం గట్టిగా అడిగితే బాపూఘాట్ వద్ద అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెడతామ ని రేవంత్‌రెడ్డి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గాంధీకి విగ్రహాలు ఇష్టం ఉండవని.. అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మాగాంధీ మన వడు సూచించారు.
కానీ గాడ్సే వారసుడు రేవంత్‌రెడ్డి గాంధీ విగ్రహం పెడతానని అంటున్నారు. మహాత్ముడి విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదు. ఇచ్చి న హామీలు, సంక్షేమ పథకాలకు పైసలు లేవుగానీ.. మూసీకి రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తారట. ఆ మూసీ మూటల్లో మీ వాటా ఎంతో చెప్పాలి.
హైదరాబాదీలు మోసపోలేదు..
ఇవాళ హైదరాబాద్ ప్రజల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ల్లో కొందరు మోసపోయారు. కాంగ్రెస్ వాళ్ల మాట లు, వ్యవహారం తెలుసు కాబట్టి హైదరాబాద్ వాళ్లు మాత్రం మోసపోలేదు. 24 నియోజకవర్గాల్లో చైతన్యాన్ని చూపించి బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పార్టీ వీడిన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తాపపడే రోజు వస్తుంది.
కార్యకర్తలంతా పార్టీని వెన్నంటే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కొట్లాడి.. వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం కార్తీక్‌రెడ్డికి వచ్చి ంది. ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే.. అంత మేలు జరుగుతుంది’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment