సాక్షి, అమరావతి/ప్రత్తిపాడు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో రసం పీల్చే పురుగులా దోచేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు.. 2019 ఎన్నికల్లో మళ్లీ తిరిగి లేవలేని విధంగా ప్రజలు పురుగుల మందు కొట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పోగాలం దాపురించిందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి.. దిక్కుతోచక తల్లడిల్లుతున్న చంద్రబాబు, లోకేశ్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో కొండేపాడులో నల్లి తెగులు సోకిన మిర్చి పంటలను బుధవారం హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. విభజన నేపథ్యంలో అనుభవం ఉన్న చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతారని 2014లో ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే.. ఐదేళ్లూ పంటలను నాశనం చేసే రసం పీల్చే పురుగులా రాష్ట్రాన్ని దోచేశాడని దుయ్యబట్టారు.
రాజధాని కోసం భూములా.. భూముల కోసం రాజధానా?
రాజధాని ప్రాంతాన్ని ముందే వంది మాగధులకు లీకులు ఇచ్చి.. తక్కువ ధరలకు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించి.. ఆ తర్వాత రాజధాని అమరావతిని నాటి సీఎం చంద్రబాబు ప్రకటించాడని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. రాత్రికి రాత్రే తోటలను నరికేసి.. కాల్చేసి.. భయోత్పాతం సృష్టించడం ద్వారా రైతుల నుంచి భూములను లాక్కొని.. వాటికి ల్యాండ్ ఫూలింగ్ ముసుగేశారంటూ నాడు జరిగిన పరిణామాలను ఎత్తిచూపారు. రాజధాని కోసం భూములా? భూముల కోసం రాజధాని అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే పారిపోయి వచ్చి.. కరకట్టపై అక్రమ నివాసంలో తలదాచుకున్నాడని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో రూ.80 వేల విలువ చేసే ఎకరం భూమి తాను చేసిన అభివృద్ధి వల్ల ఇవ్వాళ రూ.60 కోట్లు పలుకుతోందని.. అభివృద్ధి అంటే అదీ అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. భూముల ధరలు పెరగడం అభివృద్ధి ఎలా అవుతుందని నిలదీశారు. రాష్ట్రంలో సరైన తిండిలేక.. వైద్యం అందక.. విద్య అందక తల్లడిల్లుతున్న ప్రజలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వారిని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని.. అసలైన అభివృద్ధి అంటే ఇదీ అంటూ స్పష్టం చేశారు.
కుబేరుల కోసమే స్పాన్సర్డ్ యాత్ర.. : అమరావతిలో భూములు కాజేసిన తన అనుచరులు, తాను కుబేరులు కావడం కోసమే న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో స్పాన్సర్డ్ పాదయాత్ర చేయిస్తున్నది ఎవరన్నది ప్రజలందరికీ తెలుసని మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ యాత్ర కోసం అమెరికాలో జోలె పట్టి చందాలు వసూలు చేసిందెవరో.. బంగారం నగలు విరాళంగా ఇచ్చిం దెవరో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను అడ్డంపెట్టుకుని.. పరిపాలనను ఏ స్థాయిలో అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారనే అంశంపై తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత రిటైర్డు జడ్జి చంద్రు కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. వాస్తవాలు వెల్లడించిన జస్టిస్ చంద్రుపై చంద్రబాబు నోరు పారేసుకున్నారని.. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి కొన్ని వ్యవస్థలపై మాట్లాడలేకపోతున్నామన్నారు.
చావు దెబ్బతిన్నా సిగ్గు రాలేదా?
రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బ.. కొన్ని చోట్లకు తగలకపోవడం వల్ల టీడీపీ తరఫున కొందరు దారితప్పి గెలిచారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీపై, సీఎం వైఎస్ జగన్‌పై ప్రజాదరణ నానాటికీ పెరుగుతోందేగానీ తగ్గడం లేదని.. అదే రీతిలో టీడీపీని జనం ఛీకొడుతూనే ఉన్నారన్నారు. ఇందుకు పంచాయతీ, మున్సిపల్, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, జిల్లా పరిషత్, బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయాలే తార్కాణమన్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో సీఎం వైఎస్ జగన్ ఓడిపోతారని చెప్పే అచ్చెన్నాయుడు.. ముందు కుప్పంలో చంద్రబాబు ఓడిపోకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు.
చంద్రబాబుకే.. పోగాలం దాపురించింది
Published Thu, Dec 16 2021 3:52 AM | Last Updated on Thu, Dec 16 2021 5:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment