
సాక్షి, అమరావతి: పెగసస్ వ్యవహారంలో ఉత్తరకుమార ప్రగల్భాలు మాని కేసును ఎదుర్కొనేందుకు లోకేశ్ సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. హౌస్ కమిటీ విచారణలో పెగసస్ వినియోగంపై పూర్తి వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కోర్టులో స్టే కూడా రాదని.. పూర్తి ఆధారాలతో దొరికిపోవడం ఖాయమన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులు, సామాన్య ప్రజలు, సినిమా యాక్టర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేస్తూ దుర్మార్గమైన పాలన సాగించారని విమర్శించారు. దీనిపై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు.
చంద్రబాబు రోడ్లపైన, కొడుకు లోకేశ్ శాసనమండలిలో సవాళ్లను విసరడం అలవాటుగా పెట్టుకున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏ కేసులోనైనా స్టే తెచ్చుకోవచ్చనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప.. తప్పు చేయలేదనే ధైర్యం వారిలో లేదని ప్రజలందరికీ అర్థమైందన్నారు. జాతీయ భద్రత, ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశంలో చిన్నపిల్లాడిలా సవాళ్లు విసరడం సరికాదని లోకేశ్‌కు హితవుపలికారు.