
కాకినాడ రూరల్: రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం గొప్ప శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వికేంద్రీకరణపై ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావితరాల కోసం ఆలోచన చేశారని.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి జరుగుతుందని, విశాఖ పరిపాలనా కేంద్రంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారబోతోందన్నారు. అమరావతి పేరుతో కొత్తగా కుట్రలకు అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► 2014 నుంచి చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్‌లోనే మహానగరంగా చూపించారు.
► మా ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలన్న భావనతో మూడు రాజధానులు ఏర్పాటుకు నిర్ణయించారు. చంద్రబాబు ఉక్రోషంతో జేఏసీని ఉసిగొల్పారు.
► సింగపూర్ కన్సల్టెన్సీ, ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు భూములిచ్చారుగానీ కౌలు రైతులకు కనీసం కౌలు ఇవ్వలేకపోయారు.
► ఈ రోజు మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలతో వార్త కథనాలు వస్తున్నాయి. ఇది పద్ధతి కాదు.
► గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాలలో ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తారని, చంద్రబాబు రాజీనామా చేస్తారని లీకులు ఇస్తున్నారు.. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.. కుట్రలకు చంద్రబాబు కేంద్ర బిందువు.
► జగన్ ట్రాప్‌లో గవర్నర్ పడ్డారని లోకేష్ అంటున్నారు. ఈ మాటలేమిటి?
రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి
► రాజధానిపై రిఫరెండం పెట్టాలని చంద్రబాబు చెబుతున్నారు. మీరు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి. ఎన్ని సీట్లు వస్తాయో తెలుస్తాయి. సీఎంగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలంపాటు ఉన్న మీరు రాయలసీమ, విశాఖ, ఉభయగోదావరి జిల్లాకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా?
► విశాఖపట్నం షిప్‌యార్డులో శనివారం జరిగిన క్రేన్ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
► మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. గాయపడిన వారికీ న్యాయం చేస్తాం.