సాక్షి, అమరావతి: రోడ్లపై గుంతలు పూడ్చేందుకు శ్రమదానం పేరుతో సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. గాంధీ జయంతి రోజున గాడ్సేలా మాట్లాడారని మండిపడ్డారు. రాజమండ్రిలో రోడ్డుపై ఒక నిమిషం 8 సెకండ్ల పాటు పార పట్టి.. ఫొటోలు, వీడియో చిత్రీకరణ తర్వాత నోటికి పని చెప్పడం డ్రామా అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ తరహా శ్రమదానం ఆయన ఒక్కరే చెయగలరు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘గోతులు పూడ్చే వంకతో.. కులాల్ని రెచ్చగొట్టడమే మీ పనా.. గోతులు పూడుస్తున్నారా.. లేక గోతులు తీస్తున్నారా?’ అంటూ ప్రశ్నించారు.
కోపాన్ని దాచుకోవాలనే చెప్పే నీవు.. ఎప్పుడైనా దానిని పాటించావా.. అంటూ చీవాట్లు పెట్టారు. 2014 నుంచి 2019 వరకు రోడ్డు పనులు చేయని టీడీపీ ప్రభుత్వాన్ని అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లు రోడ్లను పట్టించుకోలేదని.. గత రెండేళ్లుగా విస్తృత వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయని చెప్పారు. వర్షాకాలం ముగియగానే రూ.2,200 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకు పవన్ కల్యాణ్ శ్రమదానం డ్రామాకు దిగారని మండిపడ్డారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
కుల రాజకీయాలు చెల్లవు
► చంద్రబాబుకు నీ తోడు.. నీకు చంద్రబాబు తోడు లేకుండా రాజకీయం చేయలేరని మీ మాటలే చెబుతున్నాయి. ఒకసారి లెఫ్ట్‌తో.. మరోసారి బీజేపీతో మీ ప్రయాణం.. మీ పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఏ ఫిలాసఫీ లేకపోవడమేనా?
► ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేక ఉగ్రవాదిలా మాట్లాడుతున్నావు. యుద్ధం అంటున్నావ్.. రెండేళ్లలో వరుస ఎన్నికల్లో నీ యుద్ధం ఏమైంది?
► 12 ఏళ్లలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాననే అక్కసుతో.. సీఎం వైఎస్ జగన్‌పై ఈర్ష, ద్వేషం, అసూయతో ఊగిపోతున్నావు. ఒక కులం భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తానంటున్నావు. ప్రజాస్వామ్యంలో ఇది సరైనదేనా?
► కాపు ఉద్యమం చేస్తున్న నాయకుడిని అణగదొక్కారంటున్నావ్.. ముద్రగడను అవమానించినప్పుడు ఏమయ్యావు? ఆయన్ను పరామర్శించడానికి వస్తున్న మీ అన్న చిరంజీవి రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నప్పుడే నువ్వు ఏమయ్యావు?
► కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వాళ్లంతా కలిసి ముందుకు వచ్చి, పెద్దన్న పాత్ర పోషించాలని మాట్లాడుతున్నావ్.. ఎవరు మాట్లాడిస్తున్న మాటలివి? ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలు చెల్లవన్న నగ్న సత్యం తెలుసుకో.
Comments
Please login to add a commentAdd a comment