
సాక్షి, విజయవాడ: కార్మికుల సమ్మె, రైతాంగ ఆందోళనలకు మద్దతుగా ఎంబీవీకే భవన్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ప్రజాపోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రజలను గాలికొదిలేస్తున్నారు.
కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారు. కార్పొరేట్ వర్గాల ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ సామాన్య ప్రజల వేతనాలు మాత్రం పడిపోతున్నాయి. రైతు బిల్లులు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రైతులు, కార్మికులు రొడెక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం' అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఈనెల 26, 27వ తేదీల్లో జరిగే అఖిలభారత సమ్మె కరోనా వచ్చిన తర్వాత జరిగే అతిపెద్ద ప్రజా ఉద్యమం. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తున్నారు. ఒకవైపు కాషాయ ఎజెండా అమలు చేస్తునే మరొకవైపు కార్పొరేట్ వర్గాలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ, అదానీ మాత్రమే బాగుపడ్డారు. చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా వీరికి అప్పగిస్తున్నారు. కేంద్ర తీరుకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు, రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు' అని సీపీఐ రామకృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment