సారా మాటలు డైవర్షన్‌ కోసమే.. బీజేపీ చీప్‌ పాలిట్రిక్స్‌ | Lella Appi Reddy Comments On BJP | Sakshi
Sakshi News home page

సారా మాటలు డైవర్షన్‌ కోసమే.. బీజేపీ చీప్‌ పాలిట్రిక్స్‌

Published Fri, Dec 31 2021 4:45 AM | Last Updated on Fri, Dec 31 2021 4:45 AM

Lella Appi Reddy Comments On BJP - Sakshi

సాక్షి, అమరావతి/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): సోము వీర్రాజు మాట్లాడిన ‘సారా మాటల‘ డైవర్షన్‌ కోసమే బీజేపీ చీప్‌ పాలిట్రిక్స్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరులో నిర్మించిన జిన్నా టవర్ను అడ్డం పెట్టుకుని ఇప్పుడు నీచ రాజకీయం చేయాలని చూడటం ఆ పార్టీ సంస్కృతిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. జీవీఎల్‌ నుంచి విష్ణు వరకు ఆ పార్టీ నేతలందరికీ సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్‌ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిన్నా టవర్‌ పేరు మార్చాలని, లేదంటే తామే కూలుస్తామని బీజేపీ నాయకులు మూకుమ్మడిగా విద్వేష విషం చిమ్మడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సిగ్గులేని సారా మాటలు మాట్లాడిందేగాక, డైవర్షన్‌ రాజకీయాలా? అని దుయ్యబట్టారు. చారిత్రక కట్టడమైన జిన్నా టవర్‌ను అప్పట్లో మత సామరస్యం కోసం కట్టారన్నారు. దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మత ఘర్షణలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌ గురించి కడపలో ఉండే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ట్వీట్‌ చేయడం, దాన్ని సమర్థిస్తూ జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజాసింగ్‌ వంటి వారు గొంతు కలపడం చూస్తుంటే, ఇదంతా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ పథకం ప్రకారం చేస్తున్న కుట్రగా అర్థం అవుతోందని చెప్పారు. ఏపీలో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నంతకాలం వారి ఆటలు సాగవని చెప్పారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు అద్వానీ 2005లో పాకిస్తాన్‌లో జిన్నా సమాధి వద్ద.. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన లౌకికవాది జిన్నా అని, ఆయన హిందూ–ముస్లింలకు అంబాసిడర్‌ వంటి వారని మాట్లాడారని ఆయన గుర్తుచేశారు.
 
బీజేపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితం: ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరులో జిన్నా టవర్‌కు జాషువా, కలాం పేర్లు పెట్టవచ్చు కదా అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా చెప్పారు. బీజేపీ నేతలు ట్విట్టర్‌ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయలబ్ధి కోసమేనని విమర్శించారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారు సామరస్యంగా మెలుగుతున్న తరుణంలో విద్వేషాలు సృష్టించేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement