సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీలో లోకల్ ఫైట్ ముదురుతోంది. స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్‌కు టీడీపీ శ్రేణులు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి. స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు.
నిన్న ఇబ్రహీంపట్నంలో బొమ్మసానికి టిక్కెట్ ఇవ్వాలంటూ ప్రజా పాదయాత్ర నిర్వహించగా, నేడు గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ చేపట్టారు. నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు. ప్రజల మద్దతు తనకే ఉందంటూ చంద్రబాబుపై బొమ్మసాని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ మైలవరం టీడీపీలోని అసమ్మతి నాయకులందరూ ఒకటవుతున్నారు. గతంలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు టికెట్ తనకే కావాలంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తనకే టికెట్టు ఇవ్వాలంటూ పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. దేవినేని ఉమాతో కలవకుండా ప్రత్యేక వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడం, టికెట్టు హామీ దక్కడంతో, ఈ రెండు వర్గాలు ఒక్కటై కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా పనిచేస్తామని ప్రకటించారు. వసంత కృష్ణ ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment