ములకలచెరువు : నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు ములకలచెరువులో సోమవారం చేపట్టిన సంఘీభావ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీకి పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేదు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నా... శంకర్‌యాదవ్ డైరెక్షన్‌లో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి అలజడి సృష్టించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దౌర్జన్యకాండకు ఒడిగట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ములకలచెరువు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంయమనంతో అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా టీడీపీ శ్రేణులు ఈలలు వేస్తూ వారి మీదికొచ్చారు. అల్లరి మూకలు వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్లు, చెప్పులతో దాడులు చేశాయి.
ఈ దాడుల్లో పోలీసులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలకూ గాయాలయ్యాయి. సంఘీభావ ర్యాలీ చేపట్టిన శంకర్ అనుచరులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని నిలిపివేయాలని మదనపల్లి డీఎస్పీ కేశప్ప మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు సూచించారు. ‘మీకు చేతనైతే ర్యాలీని ఆపుకోండి.. దేనికైనా సిద్ధం’ అంటూ శంకర్ పోలీసులను రెచ్చగొట్టారు. అంతటితో ఆగని శంకర్.. తన వాహనంతో మండల కేంద్రానికి వచ్చి అనుచరగణంతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవు : డీఎస్పీ
బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని డీఎస్పీ కేశప్ప స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జన జీవనానికి విఘాతం కలిగిస్తూ.. సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు
తెలుగు తమ్ముళ్ల దాడిలో మహిళలకు గాయాలు
యాదమరి(చిత్తూరు జిల్లా): లోకేశ్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదమరి మండలంలో చేపట్టిన సంఘీభావ యాత్రలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై టీడీపీ నాయకులు టపాకాయలు కాల్చి దాడికి దిగారు. సోమవారం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు యాదమరి నుంచి దళవాయిపల్లెకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా కావాలనే 14 కండిగ ముస్లింవాడ గ్రామం మీదుగా దళవాయిపల్లె వరకు పాదయాత్ర చేశారు. 14 కండిగ ముస్లింవాడలో వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకులు, స్థానిక సర్పంచ్ కుటుంబం కబీర్ ఇంటి ముందు బాణసంచా పేల్చి, వారిని ఇబ్బందులకు గురిచేయాలని భావించారు. ప్రణాళిక ప్రకారం వీధిలో దాదాపు 500 మీటర్ల దూరం బాణసంచా పేర్చి నిప్పు పెట్టారు.
చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు రావడంతో ఇంట్లో ఏడాది బాబుతో పాటు మహిళలు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై స్థానిక మహిళలు తెలుగు తమ్ముళ్లును ప్రశ్నించగా, వారు రెచ్చిపోయి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దీనిపై మైనారిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment