తెలుగు తమ్ముళ్ళతో ఆటాడుతున్నారా? , నియోజకవర్గాల్లో అనవసరపు ఆశలు రేకెత్తిస్తున్నారా? , ఎవరొచ్చినా సీటు మీకే అంటూ ఆశలు కల్పిస్తున్నారట లోకేష్. అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు తమ్ముళ్ళు. ఏం చేయాలో తెలియక నియోజకవర్గ నేతలు మదనపడుతున్నారు.
ఎదుటివారిని తక్కువగా అంచనా వేసి మైండ్ గేమ్ ఆడటంలో నేనే నంబర్ వన్ అని చంద్రబాబు అనుకునేవారు. కొన్నాళ్ల పాటు సాగిన ఆటలు.. ఇప్పుడు ఔట్ డేటేడ్ అయిపోయాయి. దీంతో తన పార్టీలోని వారిమీదే గేమ్ ఆడుతున్నారు తండ్రీ కొడుకులు. నాయకులు, కార్యకర్తల మధ్య స్వయంగా కుంపట్లు రాజేస్తున్నారు చంద్రబాబు, లోకేష్. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లలో చిన్న బాస్ చిచ్చుపెట్టాడు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఆశావహులంతా ప్రయత్నాలు ప్రారంభించారు.
నియోజకవర్గ ఇన్ ఛార్జి కోవెలమూడి రవీంద్రతోపాటు భాష్యం ప్రవీణ్, డాక్టర్ నిమ్మల శేషయ్య, మన్నవ మోహనకృష్ణ, డేగల ప్రభాకర్ లు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరు వెళ్లి లోకేష్ బాబును కలిశారట. వెళ్లిన ప్రతి నేతతో నీకెందుకు నేను ఉన్నాను కదా వెళ్లి నియోజకవర్గంలో నీ పని మొదలుపెట్టు అని లోకేష్ భరోసా ఇస్తున్నాడట. లోకేష్ హామీతో వచ్చే ఎన్నికల్లో నాకే టికెట్ ఇస్తారని ఫుల్ ఖుషీగా ఉన్నారట ఆయన దగ్గరకు వెళ్ళొచ్చిన నాయకులు. నియోజకవర్గంలో పని ప్రారంభించడానికి ముహుర్తం కూడా పెట్టుకున్నారు కొంతమంది నేతలు. అయితే ఇక్కడే అసలు రహస్యం బట్టబయలైంది.
లోకేష్ నుంచి హామీ పొందినవారు నియోజకవర్గంలోని కొందరు నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని, తనకు హామీ ఇచ్చారని, సహకరించాలంటూ చెబుతున్నారు. దీంతో టికెట్ నాకు ఇస్తానని చెప్పారు. మరి నీకెలా హామీ ఇచ్చారంటూ ఒకరి మొహం మరొకరు చూసుకున్నారట. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలందరూ తమ అనుచరుల ద్వారా అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.. లోకేష్ తనను కలిసిన ప్రతి ఒక్కరికీ.. తనకు చెప్పినట్లే చెప్పారని తెలుసుకున్న నాయకులు షాక్ తిన్నారట. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించి ఎవరు పనిచేసుకోవాలో తెలియక తలలు పట్టుకున్నారు.
మరోవైపు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గీయులు మా సార్ ఇక్కడనుంచి పోటీ చేస్తారంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని అనుచరులు కూడా మా సార్ ఇక్కడనుంచే బరిలోకి దిగుతారంటూ ప్రచారం చేస్తుండడంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు. నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాక క్యాడర్ గందరగోళంలో ఉంటే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు మీలో ఎవరికీ చంద్రబాబు సీటు ఇవ్వరు... ఈసారి ఎంత ఖర్చు అయినా మా సారే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఇప్పటికే అధినేతవద్ద ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన కూడా సరే అన్నారని ప్రచారం చేస్తున్నారు. దీంతో తండ్రీ కొడుకులు ఆడుతున్న డబల్ గేమ్ తో నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయట.
ఈ నేపధ్యంలోనే ఓ సీనియర్ నేత జూనియర్లకు హితబోధ చేశారట. చంద్రబాబు, లోకేష్ లను నమ్ముకుంటే డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప ప్రయోజనం ఉండదనే వాస్తవాన్ని, నగ్నసత్యాన్ని చెప్పారట. ఎన్నికల సమయానికి గల్లా జయదేవ్ మాదిరిగా ఏ వ్యాపారవేత్తనో తెచ్చి అయ్యా కొడుకులు మనమీద పెడతారు.... మీరు తొందరపడి పార్టీకోసం ఖర్చు పెట్టొద్దంటూ తన అనుభవాన్ని వివరించారని ప్రచారం జరుగుతోంది. దీంతో సీటు కోసం పోటీ పడుతున్న జూనియర్లంతా వామ్మో ఇదేం రాజకీయమంటూ తలలు పట్టుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment