ఈ తొమ్మిది లోక్‌సభ సీట్లలో హోరాహోరీ? | Lok Sabha Election: 9 Seats Where Battle Between BJP, Congress | Sakshi
Sakshi News home page

Lok Sabha Election: ఈ తొమ్మిది లోక్‌సభ సీట్లలో హోరాహోరీ?

Apr 16 2024 8:48 AM | Updated on Apr 16 2024 9:35 AM

Loksabha Election 9 Seats Where Battle Between BJP Congress - Sakshi

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభానికి రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ పార్టీ చెబుతుండగా, తామేమీ తగ్గేది లేదని ఇండియా కూటమి సవాల్‌ విసురుతోంది. అయితే దేశంలోని తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్‌కు హోరాహోరీ పోరు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
1. రాజస్థాన్‌లోని చురు
రాజస్థాన్‌లోని చురు నుంచి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఝఝరియా, కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ కశ్వాన్‌ పోటీ చేస్తున్నారు. వీరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడనున్నదని తెలుస్తోంది. చురు బీజేపీకి కంచుకోటగా పేరొందింది. బీజేపీ అభ్యర్థి దేవేంద్ర పారాలింపిక్స్‌లో రెండుసార్లు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అయితే 2015 ఉప ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కశ్వాన్‌ మూడు లక్షల ఓట్లతో విజయం సాధించారు.

2. యూపీలో నగీనా 
యూపీలోని నగీనా నుంచి బీజేపీ తరపున ఓం కుమార్, ఎస్పీ నుంచి మనోజ్ కుమార్, బీఎస్పీ నుంచి సురేంద్ర పాల్ బరిలో ఉన్నారు. ఈ సీటు కూడా చాలా ఆసక్తికరంగా మారింది. 

3. అసోంలోని జోర్హాట్‌
అసోంలోని జోర్హాట్‌ నుంచి బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ గొగోయ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ పోటీకి దిగారు. ఈ సీటు తరుణ్ గొగోయ్‌కి కంచుకోటగా గుర్తింపు పొందింది. ఈ సీటు నుంచి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

4. కోయంబత్తూరు
తమిళనాడులోని కోయంబత్తూరు సీటుకు సంబంధించి డీఎంకే నుంచి గణపతి పి రాజ్‌కుమార్, బీజేపీ నుంచి కే అన్నామలై, ఏఐఏడీఎంకే నుంచి సింగై జీ రామచంద్రన్‌లు పోటీలో ఉన్నారు. ఈ సీటుపై అందరి దృష్టి నిలిచింది. 

5. వయనాడ్ 
వయనాడ్‌ నుంచి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, బీజేపీ నుంచి కే సురేంద్రన్‌, సీపీఐ నుంచి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో 32 శాతం ముస్లింలు, 13 శాతం క్రైస్తవులు ఉన్నారు. ఈ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది.

6. పూర్ణియా
బీహార్‌లోని పూర్ణియాలో ఆర్జేడీ తరపున బీమా భారతి, జేడీయూ నుంచి సంతోష్ కుమార్ కుష్వాహా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ బీమా భారతి సిట్టింగ్ ఎంపీ సంతోష్ కుమార్‌కు పోటీగా నిలిచారు. కాగా ఈ సీటు నుంచి పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది.

7. తిరువనంతపురం
తిరువనంతపురం నుంచి కాంగ్రెస్‌ తరపున శశిథరూర్‌, బీజేపీ నుంచి రాజీవ్‌ చంద్రశేఖరన్‌, సీపీఐ నుంచి పన్నయన్‌ రవీంద్రన్‌ మధ్య పోటీ నెలకొంది. ఈసారి శశి థరూర్‌కు చంద్రశేఖరన్ నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నదని చెబుతున్నారు.

8. రాజస్థాన్‌లోని బార్మర్‌
బార్మర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్‌ చౌదరి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఉమేద్‌ రామ్‌ బెనివాల్‌, స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్‌ భాటి మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. 

9. త్రిసూర్‌లో 
కేరళలోని త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థి సురేష్‌ గోపి, కాంగ్రెస్‌ అభ్యర్థి కే మురళీధరన్‌, సీపీఐ అభ్యర్థి వీఎస్‌ సునీల్‌ మధ్య పోటీ నెలకొంది. 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే గెలుస్తూ వచ్చాయి. అయితే  ఈ సీటులో బీజేపీకి గట్టి పోటీ ఎదురుకానున్నదని అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement