టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ
తెలంగాణ నేతకు ఏపీలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి బీసీలకు జగన్ ప్రాధాన్యం కల్పించారు
ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ పనే అయి ఉంటుంది
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పినా తనకు పోటీ చేయడం ఇష్టలేదని స్పష్టం చేశానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బీఆర్‌ఎస్‌నుద్దేశించి సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడితే ఎగిరెగిరి పడిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు, ఆయన భాషకు ఏం చెప్తారని ప్రశ్నించారు.
కేటీఆర్‌కు ముసళ్ల పండుగ ముందుందని, బీఆర్‌ఎస్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేటీఆర్ ఉండి ఉంటారని అభిప్రాయపడ్డ మధుయాష్కీ.. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు ఎ1, ఎ2 అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని మాత్రమే తప్పు పట్టామని, కేజ్రీవాల్‌పై విచారణను ఏఐసీసీ తప్పు పట్టలేదని మధుయాష్కీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment