
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. తనకు ఈరోజు(బుధవారం) కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. చెప్పాల్సింది చాలా ఉదని, ఈ రోజు చాలా ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు.
‘హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన. దేశంలో టాప్-5 సీఎంలలో నేను ఒకడిని. బాల్‌థాక్రే వారసత్వాన్ని కొనసాగించేది మేమే. నేను ప్రజల్నికలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. కరోనా వల్ల ప్రజలను కలవలేకపోతున్నా. ఇప్పుడు ఉత్పన్నమైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని సీఎం పేర్కొన్నారు.
ఆ సమయంలో సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా
'30 ఏళ్లుగా మేము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించాం. కానీ శరద్‌పవార్.. నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు. ఆ సమయంలో ఓ సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా. ఎన్సీపీ, కాంగ్రెస్ నాకు పూర్తి సహకారం అందించాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యా. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గవర్నర్‌కు కూడా తెలియజేశా. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
నమ్మకద్రోహానికి గురయ్యా
ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలి. సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్‌నాథ్ షిండేను ఆహ్వానిస్తున్నా. నేను నమ్మకద్రోహానికి గురయ్యాను. నాతో ఏక్‌నాథ్ షిండే నేరుగా మాట్లాడాలి. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. శివసేన పార్టీని నడిపేందుకు నేను పనికిరానని చెప్పండి.. పార్టీ నుంచి తప్పుకుంటా. పదవులు వస్తాయి.. పోతాయి. అధికారం కోసం నేను పాకులాడటం లేదు అని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
చదవండి: ‘మహా’ రాజకీయంలో ట్విస్ట్.. తిరిగొచ్చిన శివసేన ఎమ్మెల్యే. ఏం చెప్పాడంటే!
Comments
Please login to add a commentAdd a comment