ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు.
2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు.
‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్‌ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment