ముంబై: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఖండించారు. యోగి పేరు ప్రస్తావించడకుండా.. బయట వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తారని, మహారాష్ట్ర ఎప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగిస్తోందని ఆయన అన్నారు.
‘మహారాష్ట్రను ఇతర రాష్ట్రాలతో ఎవరూ పోల్చకూడదు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. బయటి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేస్తున్నారు, కానీ మహారాష్ట్ర ఎప్పుడూ మత విభజనను అంగీకరించలేదు. షాహు (మహారాజ్), జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లౌకిక భావజాలాన్ని రాష్ట్రం అనుసరిస్తోంది’ అని వెల్లడించారు.
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన పార్టీ అభ్యర్థి నవాబ్ మాలిక్ తరపున తాను ప్రచారం చేస్తానని అజిత్ పవార్ తెలిపారు. మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. మన్‌ఖుర్డ్-శివాజీనగర్ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే శివసేన కూడా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టింది.ఇద్దరూ మహాయుతి అభ్యర్థులు కాగా, బీజేపీ మాత్రం షిండే అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. మాలిక్‌కు ప్రచారం చేయడం లేదని స్పష్టం చేసింది.
కాగా అజిత్ పవార్ ఎన్సీపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే యోగి వ్యాఖ్యలపై అజిత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కూటమిలో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment