ఏక్‌నాథ్ షిండే; ఉద్ధవ్ ఠాక్రే; సూరత్‌లో శివసేన ఎమ్మెల్యేలున్న మెరీడియన్ హోటల్ బయట భారీ భద్రత
ముంబై: అదను చూసి బీజేపీ తెర తీసిన ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్ షిండే (58) తిరుగుబావుటా ఎగురవేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి వేరు బాట పట్టారు. సోమవారం రాత్రే వారందరినీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌కు తరలించారు.
వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. షిండే శిబిరంలో చేరిన శివసేన ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా 32కు పెరిగిందంటూ కూడా వార్తలొస్తున్నాయి. మరో నలుగురు స్వతంత్రులూ వీరికి తోడయ్యారని చెబుతున్నారు. దాంతో రెండున్నరేళ్ల శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ అధికార మహా వికాస్ అగాఢీ (ఎంవీఏ) కూటమి మైనారిటీలో పడినట్టే కన్పిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది ఎమ్మెల్యేలున్నారు.
శివసేన ఎమ్మెల్యే ఒకరు ఇటీవల మరణించిన నేపథ్యంలో ప్రస్తుత సంఖ్య 287. ఆ లెక్కన మెజారిటీ మార్కు కూడా సరిగ్గా 144. ఎంవీఏకు 168 మంది ఎమ్మెల్యేలుండగా షిండేతో కలిసి 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే దాని బలం కూడా సరిగ్గా 144కు తగ్గుతుంది. షిండే వెంట అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుండటం నిజమైతే సర్కారు మైనారిటీలో పడ్డట్టే. అన్నీ కలిసొస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించి వేడిని మరింత పెంచారు.
ఇదంతా బీజేపీ ఆపరేషన్ కమలంలో భాగంగానే జరుగుతోందని అధికార సంకీర్ణం ఆరోపిస్తోంది. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత మందిని బీజేపీ లాగేయకుండా చూసేందుకు సేన తమ ఎమ్మెల్యేలను మంగళవారం రాత్రి ముంబైలో ఓ హోటల్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగబోయే పరిణామాలపైనే అందరి దృష్టీ నెలకొంది.
మండలి ఫలితాలతో కాక
సోమవారం రాత్రి 10 శాసనమండలి స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడుతూనే మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. ఆరు సీట్లకు పోటీ చేసిన అధికార కూటమి ఒక స్థానంలో అనూహ్యంగా ఓటమిపాలైంది. నాలుగు సీట్లే గెలవాల్సిన బీజేపీ ఐదో సీటూ చేజిక్కించుకోవడంతో అధికార కూటమి ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్టు తేలిపోయింది. 10 రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ అదనపు సీటు గెలుచుకుంది. అప్పట్నుంచే సంకీర్ణంలో లుకలుకలు మొదలయ్యాయి.
37కు తగ్గితే అనర్హత వేటు!
శివసేనను చీల్చి వేరు కుంపటి పెట్టాలంటే షిండేకు 55 మంది పార్టీ ఎమ్మెల్యల్లో మూడింట రెండొంతుల మంది కావాలి. అంటే 37 మంది అవసరం. అంతకు తగ్గితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారందరిపైనా అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే 36 మంది సేన ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోకి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వారిలో శివసేనకు చెందినవారు 32 మందేనని, నలుగురు స్వతంత్రులని కూడా చెబుతున్నారు.
ఉద్ధవ్ మాట్లాడినా...
షిండేను బుజ్జగించేందుకు సేన ఎమ్మెల్యేలు మిలింద్ నర్వేకర్, రవీంద్ర పాఠక్ సూరత్ వెళ్లి మెరీడియన్ హోటల్లో షిండేతో రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఉద్ధవ్ కూడా షిండేతో ఫోన్లో పది నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు గుడ్‌బై కొట్టి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా షిండే డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. సేన ఎమ్మెల్యేలు వెనుదిరిగిన కాసేపటికే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అతి సన్నిహితుడైన బీజేపీ నేత సంజయ్ కౌతే కూడా హోటల్‌కు వెళ్లి షిండేతో చర్చలు జరిపారు!
హోటల్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వారిని అహ్మదాబాద్ తరలిస్తారని సమాచారం. అధికారం కోసం ఎప్పటికీ మోసానికి దిగబోనంటూ షిండే ట్వీట్ చేసి వేడిని మరింత పెంచారు. ‘‘మేమంతా బాలాసాహెబ్ ఠాక్రేకు విధేయులమైన కరడుగట్టిన శివసైనికులం. ఆయన నుంచి హిందూత్వ పాఠాలు నేర్చుకున్నాం. అధికారం కోసం మోసానికి దిగలేం. బాల్ ఠాక్రే నేర్పిన పాఠాలను ఎన్నటికీ వదులుకోలేం’’ అని పేర్కొన్నారు. ఈ విమర్శలు నేరుగా ఉద్ధవ్‌పైకేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ విప్ పదవి నుంచి షిండేను పార్టీ తొలగించింది.
పవార్‌తో ఉద్ధవ్ చర్చలు
సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ఉద్ధవ్ మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. అయితే, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి రాష్ట్ర హోం మంత్రికి తెలియకుండా రాష్ట్రం వీడటం అసాధ్యమన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. రాష్ట్ర హోం మంత్రి దిలీప్ పాటిల్ ఎన్సీపీ నాయకుడే! దాంతో, షిండే తిరుగుబాటు గురించి పవార్‌కు ముందే తెలుసనీ అంటున్నారు. అంతకుముందు పవార్ మాట్లాడుతూ ఈ సంక్షోభాన్ని శివసేన అంరత్గత వ్యవహారంగా అభివర్ణించారు. దీన్నెలా పరిష్కరించాలో ఉద్ధవ్ చూసుకుంటారన్నారు. అధికార కూటమిని కూలదోసేందుకు ఈ రెండున్నరేళ్లలో ఇది మూడో ప్రయత్నమన్నారు.
ఆపరేషన్ కమలం
మహారాష్ట్రలో తాజా రాజకీయ క్రీడ బీజేపీ ఆపరేషన్ కమలంలో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్ద ఆశీస్సులతో రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సంక్షోభానికి పథక రచన చేసినట్టు చెబుతున్నారు. మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతో కలిసి పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఫడ్నవీస్ మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ తర్వాతే రాష్ట్రంలో రాజకీయ కాక పరాకాష్టకు చేరింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సభ్యులు పోను ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులు 29 మంది ఉన్నారు. వీరిప్పుడు కీలకంగా మారారు. వీరిలో ప్రస్తుతం 16 మంది అధికార కూటమికి, 8 మంది బీజేపీ కూటమికి మద్దతిస్తున్నారు. ఎటూ మొగ్గనివారు
ఐదుగురున్నారు.
Comments
Please login to add a commentAdd a comment