కలకత్తా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువామొయిత్రా రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుస్తారా అంటే కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని మహువా నియోజకవర్గం కృష్ణానగర్ నుంచి బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇక్కడి నుంచి మహువా అభ్యర్థిత్వాన్ని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది.
తాజాగా ఆదివారం(మార్చ్ 24) ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాలో కృష్ణానగర్ సీటును స్థానిక రాజవంశానికి చెందిన రాజమాత అమ్రితా రాయ్‌కి కేటాయించింది. ఈమె గత వారమే బీజేపీలో చేరడం గమనార్హం. 18వ శతాబ్దంలో బెంగాల్‌ను పరపాలించిన మహారాజ కృష్ణ చంద్ర రాయ్ చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకు కూడా గుర్తు చేసుకుంటారు.
కృష్ణా నగర్ బీజేపీ టికెట్ దక్కించుకున్న రాజమాత అమ్రితా రాయ్ కృష్ణచంద్రరాయ్ వంశానికి చెందినవారే. నడియా జిల్లా బీజేపీ నాయకత్వం ఏరికోరి రాజమాత అమ్రితా రాయ్‌కి కృష్ణానగర్ టికెట్ ఇప్పించారని, పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌చౌబే స్వల్పంగా 63,218 ఓట్ల తేడాతో మహువా విజయం సాధించారు.
మహువా గెలుపులో టీఎంసీకి అప్పట్లో గట్టి పట్టున్న కాలీగంజ్, చోప్రా, పలాషిపర అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. అయితే వీటిలో కాలీగంజ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత కొన్ని నెలల్లో బీజేపీ బలపడినట్లు చెబుతున్నారు. దీనికి తోడు నడియా జిల్లా వ్యాప్తంగా టీఎంసీ గతంతో పోలిస్తే బలహీనపడినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో డబ్బుకు ప్రశ్నలడిగిన కేసులో ఇప్పటికే ఈ టర్ములో ఎంపీ సభ్యత్వం కోల్పోయి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మహువా కృష్ణానగర్ నుంచి పార్లమెంటులో మళ్లీ అడుగుపెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి.. కంగనకు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment