
బంకురా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఓటమిని ఆమె ముందే ఊహించారు కాబట్టే సాకు కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరును ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే ఆమె పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆదివారం బెంగాల్‌లోని బంకురాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. బెంగాల్‌లో అసలైన మార్పు (అసోల్ పరివర్తన్) కచ్చితంగా వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి మార్పు తప్పనిసరి అని అన్నారు. బెంగాల్‌లో అవినీతి ఆట ఇక సాగదని వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి
మమతా బెనర్జీ తన తలపై కాలితో తన్నుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ చిత్రీకరించిన వాల్ పోస్టర్లను నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ‘‘130 కోట్ల మంది ప్రజల ఎదుట ఎల్లప్పుడూ శిరస్సు వంచుతూనే ఉంటా. నా తలపై మమతా బెనర్జీ కాలు పెట్టొచ్చు, నన్ను తన్నొచ్చు. కానీ, బెంగాల్ ప్రజల కలలను తన్ని పారేస్తానంటే మాత్రం అనుమతించే ప్రసక్తే లేదు’’ అని ఘాటుగా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ నిధి వంటి పథకాలను బెంగాల్‌లో దీదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. స్కీమ్‌లపై బీజేపీ నడుస్తుండగా, స్కామ్‌లపై తృణమూల్ కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ పదేళ్లుగా బెంగాల్ ప్రజల జీవితాలతో అడుకుంటున్నారన్నారు. ఇక ఆమె ఆట ముగిసి, అభివృద్ధి మొదలవుతుందని పేర్కొన్నారు. బెంగాల్ ప్రగతి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కారు) కావాలన్నారు. ప్రజలకు అవినీతి రహిత సేవలు, అభివృద్ధి కోసం బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment