కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం దేశ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఎప్పటి నుంచో బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న బీజేపీ.. దానికి అనుగుణంగా ప్రణాళికలు, ఎత్తుగడలను సిద్ధం చేసి ఒక్కొక్కటిగా ప్రయోగిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గట్టిదెబ్బ కొట్టి తన ఉనికి చాటుకున్న కాషాయదళం.. క్రమంగా బలపడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాలు విసురుతోంది. అనంతరం ఇటీవల జేపీ నడ్డా పర్యటనలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు.. ఇరు పార్టీల మధ్య వివాదం మరింత పెంచాయి. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీతో మమతకు ఊహించని షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారితో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడం కలకలం రేపింది. (ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్’)
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు మమతకు ఈ పరిణామం భారీ ఎదురుదెబ్బ లాంటిది. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీని వీడి బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీదీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టీఎంసీని చావుదెబ్బ తీసి కాషాయజెండా ఎగరేస్తామని షా ప్రకటించడం అధికార పార్టీ నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు బీజేపీ నేతల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా గల బీజేపీ వ్యతిరేక పక్షాల నుంచి మద్దతను కూడగట్టకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మమతతో చర్చించారు. బెంగాల్‌లో జరుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలను దీటుగా ఎదుర్కొనేందుకు తాను మద్దతుగా ఉంటానని పవార్ ప్రకటించారు.
అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో సైతం పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు అధికార పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే దానికంటే ముందుగా బెంగాల్‌లో భారీ ర్యాలీని మమత ఏర్పాటు చేయబోతున్నారని, దీనికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన అధినేత సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో జేడీ నడ్డాపై దాడికి ప్రతిచర్యగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయం అనంతరం.. అనేక మంది జాతీయ నేతలు మమతకు అండగా నిలిచి.. బీజేపీ తీరును తప్పుపట్టారు. కాగా మమత, పవార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసింది. గతంలో అనేకమార్లు బెంగాల్ ప్రభుత్వానికి పవార్ అండగా నిలిచారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment