
ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్న మమతా బెనర్జీ
కోల్‌కతా: మండిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సెక్రటేరియట్‌కు వెళ్ళి తన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి ఫిరాద్ హకీం ఎలక్ట్రిక్ స్కూటర్‌ని నడుపుతుండగా మమతా బెనర్జీ పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు రాసివున్న ప్లకార్డుని మెడలో తగిలించుకొని స్కూటర్ వెనుక సీట్లో కూర్చున్నారు. హజ్రామోర్ నుంచి సెక్రటేరియట్‌కి 7 కిలోమీటర్ల దూరం ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఈ వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. నాబన్నకి చేరుకున్న అనంతరం దీదీ మాట్లాడుతూ ఇంధన ధరలకు వ్యతిరేకంగా శుక్రవారం నుంచి ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి రాకముందు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో వాటి ధరలను పెంచేస్తోందని మమత ఆరోపించారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని అమ్మేస్తున్నారన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరు మార్చి, మోదీ పేరు పెట్టడాన్ని తప్పు పట్టారు. వారి తీరు చూస్తే ఈ దేశం పేరుని కూడా మారుస్తారో ఏమో అని వ్యాఖ్యానించారు.