కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల క్రితం తనకు అధికారాన్ని తెచ్చిపెట్టిన రైతు ఉద్యమ కేంద్రం నందీగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నట్టు సోమవారం ప్రకటించారు. అంతేకాదు వీలైతే కోల్‌కతాలోని భవానిపూర్, తూర్పు మిడ్నాపూర్‌లోని నందీగ్రామ్ రెండింటినుంచీ పోటీ చేస్తానని తెలిపారు. గత ఐదేళ్ళలో తొలిసారిగా నందీగ్రామ్ బహిరంగ సభలో ఆమె ఈ సంచలన ప్రకటన చేశారు. (సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం)
ఇటీవల పార్టీకి చెందిన సీనియర్ నేత, నందీగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీదీ తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలుపొందిన ఆమె దయచేసి చెడుగా భావించవద్దు, మీకోసం మంచి అభ్యర్థిని కేటాయిస్తానని భవానీపూర్ వాసులకు భరోసా ఇచ్చారు. తద్వారా బీజేపీకి, ఇటు సువేందుకు సవాలు విసిరారు. అంతేకాకుండా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సువేందు అధికారికి చెక్ పెట్టాలనే వ్యూహంలో భాగంగానే మమత అక్కడ పోటీకి సిద్ధమైనట్లు టీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
‘నందీగ్రామ్ తనకు లక్కీ ప్లేస్ అని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. 2016 ఎన్నికలలో నందీగ్రామ్ నుండే ప్రకటించా.. ఈ రోజు కూడా నందీగ్రామ్‌కు వచ్చాను. ఈ క్రమంలో 2021ఎన్నికలలో టీఎంసీ గెలిచి తీరుతుదంటూ’ ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీకి నందీగ్రామ్ అత్యంత ప్రతిష్టాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఎందుకంటే 2006-08లో నందీగ్రామ్, సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేక సామూహిక ఉద్యమాలు బెనర్జీ రాజకీయ పునరుత్థానానికి మార్గం సుగమం చేశాయి. ఈ క్రమంలో 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు తద్వారా దీదీకి చెక్ చెప్పాలని బీజేపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొన్ని నెలలుగా బీజేపీ అగ్ర నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా, జెపీ నడ్డీ దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో 294 సీట్లకు మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment