మోదీ, మమతా
PM Modi Vs CM Mamata న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. బుధవారం ప్రధాని మోదీతో జరిగిన డిజిటల్ మీటింగ్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో దీదీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రిషి అరవింద్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం జరగనున్న మీటింగ్‌కు హాజరు కావడం లేదని మమతా బెనర్జీ నేడు ప్రకటించారు.
అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఐతే సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా ఆమెకు మాట్లాడే అవకాశం రాలేదు. దీనికి సంబంధించి స్పీకర్ల జాబితాలో మమత పేరును చేర్చలేదని రాష్ట్ర సచివాలయం చెబుతోంది. దీనిపై మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలోకూడా కరోనాకు సంబంధించి 10 రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమెకు మాట్లాడే అవకాశం లభించలేదు.
ఐతే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నబన్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు (గురువారం) సీఎం మమతా బెనర్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాటి సమావేశంలో తాను పాల్గొనబోవడంలేదని తెలిపారు. అంతేకాకుండాప్రధాని మీటింగ్‌లో యోగేన్ చౌదరి, జై గోస్వామి మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని సీఎం మమతా తీవ్రంగా ఖండించారు. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. జనవరి 23 నుంచి జనవరి 30 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు.
కాగా ఆధ్యాత్మిక గురువు రిషి అరవింద్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 53 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడ, మమతా బెనర్జీలతో సహా పలువురు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉండగా, సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో పాల్గొనడం లేదని ఈ మేరకు ప్రకటించారు.
చదవండి: ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ?
Comments
Please login to add a commentAdd a comment