
పశ్చిమ బెంగాల్:పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలనే కలకత్తా హైకోర్టు ఆదేశాలపై పశ్చిమ బంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ సమావేశమైన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి 48 గంటలపాటు పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వం వహించిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లు చెలరేగిన జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 2021 కలకత్తా మున్సిపల్ ఎన్నికల్లో, 2022లో మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండ జరిగిన నేపథ్యంలో హైకోర్టు కేంద్ర బలగాలను నియమించాలని ఎస్‌ఈసీకి ఆదేశించింది.
జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు'
Comments
Please login to add a commentAdd a comment