కరీంనగర్‌ ఎవరిది పవర్‌..? | In many places BRS and Congress are fighting face to face | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ ఎవరిది పవర్‌..?

Published Sun, Nov 19 2023 4:49 AM | Last Updated on Sun, Nov 19 2023 4:49 AM

In many places BRS and Congress are fighting face to face - Sakshi

ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజ ఈ ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపు ఏకపక్షంగా నిలిచిన ఈ జిల్లాలో ఈసారి చాలా నియోజకవర్గాల్లో  హోరాహోరీ పోరు, కొన్నిచోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. క్షేత్రస్థాయిలో అధికార బీఆర్‌ఎస్‌కు కొంత అసంతృప్తి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి.

అయితే  ప్రచారపర్వం వేగం పుంజుకుంటే తమకే పరిస్థితి అంతా అనుకూలమవుతుందన్న ఆశాభావం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. గత ఎన్నికల్లో ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకేఒక్క సీటును గెలిచిన కాంగ్రెస్‌ ఈసారి కచ్చితంగా ‘గతం కంటే ఎక్కువ’ ఫలితం సాధించే పరిస్థితులున్నాయి. ఇక జిల్లాలో బీజేపీ ప్రదర్శన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా ఇక్కడి 13 అసెంబ్లీ స్థానాల్లో  మెజారిటీ సీట్లు సాధించి బీఆర్‌ఎస్‌ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్‌ సాధిస్తుందా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధిస్తుందా?.. బీజేపీ పుంజుకునేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయా? లేక రాజకీయ విశ్లేషణలు, అంచనాలకు అతీతంగా ‘హంగ్‌’ ఫలితం వచ్చేలా ప్రజలేమైనా తీర్పునివ్వబోతున్నారా అన్న వాదనల నడుమ ‘సాక్షి’ క్షేత్రస్థాయి రిపోర్ట్‌ ఇది.. 

పెద్దపల్లి  అసంతృప్తి లొల్లి 
పెద్దపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లలో కొందరు మనోహర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు చక్కబడుతున్నాయని, ఈ ఎన్నికల్లో విజయరమణారావు గెలిచే అవకాశాలు మెరుగయ్యాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. బీజేపీ నుంచి కొత్త అభ్యర్థిగా బరిలో దిగిన డి.ప్రదీప్‌రావు తన బలాన్ని కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. బీఎస్పీ నుంచి పోటీచేస్తున్న మహిళా అభ్యర్థి మహిళా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.  

మంథని  గెలుపుపై మథనం 
ఇక్కడ శ్రీధర్‌బాబు (కాంగ్రెస్‌), పుట్ట మధు (బీఆర్‌ఎస్‌) మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నా శ్రీధర్‌కు ఒకింత మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. శ్రీధర్‌కు వ్యక్తిగత ఇమేజ్‌ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుండగా, అందరితో కల­వ­కపోవడం, కొంత అహం ప్రదర్శించడం వంటివి ప్రతికూలంగా మారొచ్చునంటున్నారు. పు­ట్ట మధు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వ­హ­ణ, స్థానికంగా అందుబాటులో ఉండడం, పో­టీలో ఒక్కడే బీసీ అభ్యర్థి కావడంతో పరిస్థితు­లు అనుకూలించవచ్చనే చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి చందుపట్ల సునీల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. 

చొప్పదండి (ఎస్సీ)   ఎవరికో ఓట్లు దండి! 
నియోజకవర్గ అభివృద్ధిలో రవిశంకర్‌ (బీఆర్‌ఎస్‌) వెనుకబ డ్డారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. 2014లో అప్పటి ఎమ్మె­ల్యే శోభ తీసుకొచ్చిన నిధులు, అభివృద్ధి పనులతోనే ఆయన నెట్టుకొస్తున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మె­ల్యేపై ప్రజల్లో వ్యతిరేకత సత్యం (కాంగ్రెస్‌)కు సానుకూలంగా మారొచ్చునంటున్నారు. గత ఎన్నికల్లో బీ జేపీ తరఫునే పోటీచేసిన శోభకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈసారి పోటీలో ఉన్న ఆమె ఏ మేరకు సానుకూలత సాధిస్తారనేది చూడాల్సి ఉంటుందంటున్నారు. ఈ నియోజకవర్గంలో 1999 నుంచి చూస్తే.. ఎవరూ రెండోసారి ఎన్నికైంది లేదు.  

జగిత్యాల  త్రిముఖ పోటీతో గజిబిజి 
ఎమ్మెల్యే సంజయ్‌ (బీఆర్‌ఎస్‌), జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌) మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. కంటి డాక్టర్‌గా సంజయ్‌కు మంచి పేరే ఉన్నా,  ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే ప్రతికూలంగా మారొచ్చునంటున్నారు. ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డికి ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నందున ఆయనను తప్పక గెలిపించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో కొందరున్నారు. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీలో ఉన్న డాక్టర్‌ భోగ శ్రావణి బీసీ పద్మశాలి. ఇక్కడ ఈ వర్గం ఓట్లు ఎక్కువున్నాయి. ఆమెకు ఈ ఓట్లు అధికంగా పడితే ఊహించని ఫలితం రావొచ్చునంటున్నారు. 

హుస్నాబాద్‌   ఏ పార్టీకి జిందాబాద్‌? 
ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావంతో వి.సతీశ్‌కుమార్‌ (బీ ఆర్‌ఎస్‌)కు ప్రతికూల పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కొంత సానుకూలత పెరగడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. గౌడ, ఇతర వర్గాలు ఎక్కువగా ఉండడం బీసీ ఓటింగ్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశాలున్నా య ని చెబుతున్నారు. 2009లో గెలిచిన ప్రవీణ్‌రెడ్డికి ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ప్రవీణ్‌ నుంచి ప్రభాకర్‌కు పూర్తి సహకారం అందితే గెలుపునకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. బీజేపీ టికెట్‌పై బొమ్మ శ్రీరాంచక్రవర్తి పోటీ చేస్తున్నారు. 

ధర్మపురి (ఎస్సీ)    గెలుపు కోసం హోరాహోరీ 
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ (బీఆర్‌ఎస్‌)పై సౌమ్యుడు అనే ముద్ర ఉన్నా.. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుండడంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దళితబంధు, బీసీబంధు వంటివి సరిగా అమలుకాకపోవడం, మంత్రితో సన్నిహితంగా ఉండే ద్వితీయశ్రేణి నాయకులు, అనుయాయుల వైఖరి, వారిపై ఆరోపణలు ప్రతికూలంగా మారతాయని అంటున్నారు.

దీంతో కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశముందని, వరుసగా మూడు, నాలుగుసార్లు ఓడడంతో లక్ష్మణ్‌కుమార్‌పై సానుభూతి పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎస్‌.కుమార్‌కు వనరుల కొరత ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. పోటీకి దరఖాస్తు చేసుకోకపోయినా చివరి నిముషంలో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉన్నంతలో పార్టీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

కోరుట్ల   ఏ ఓటు మొగ్గు ఎట్లా? 
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్‌ బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచారు. గతంలో విద్యాసాగర్‌రావుపై పోటీచేసిన నర్సింగరావు (కాంగ్రెస్‌) ఈసారీ పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (బీజేపీ) కూడా బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. విద్యాసాగర్‌రావు గతంలో చేసిన అభివృద్ధి ఆయన కుమారుడు సంజయ్‌ గెలుపునకు దోహద పడొచ్చునని చెబుతున్నారు.

ముస్లిం ఓట్లు చీలి కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్‌కు పడే అవకాశాలున్నాయని అంటున్నారు. పూర్తిగా మైనారిటీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గితే ఫలితం మరోలా ఉండొచ్చునంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులిద్దరూ వెలమ సామాజికవర్గానికి చెందడంతో, మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కి బీసీ ఓటింగ్‌ ఉపయోగపడితే కొంత మార్పు రావొచ్చునని చెబుతున్నారు. 

సిరిసిల్ల  నల్లేరుపై నడకేనా! 
నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసినందున ఇక్కడ కేటీఆర్‌ (బీఆర్‌ఎస్‌) గెలుపు దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. నియోజకవర్గంలో కేటీఆర్‌ తరచూ పర్యటిస్తున్నా ఎక్కువగా సామాన్య ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా ద్వితీయశ్రేణి నాయకులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఐదేళ్లలో ఇక్కడున్న 114 గ్రామాల్లో మూడోవంతు కూడా ఆయన పర్యటించ లేదని అంటున్నారు. గతంలోనూ కేటీఆర్‌తో పోటీ చేసి ఓడిన మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌) ఈ ఎన్నికల్లో గట్టి పోటీనే ఇస్తారనే చెబుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ స్థానికేతురాలు కావడంతో అంతగా ప్రభావం చూపించకపోవచ్చని అంచనా. 

బీఎస్పీ చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం ? 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహుజన సమాజ్‌­పార్టీ (బీఎస్పీ) పోటీలో ఉంది. వీటిలో పెద్దపల్లి, వేములవాడ,  రా­మ­గుండం, హుజూరాబాద్‌లో ప్రధా­న పార్టీ­ల అభ్యర్థుల గెలుపోట­ము­లను శాసించే స్థాయిలో గణనీయమైన ఓట్ల­ను సాధించే అవకాశా­లు కనిపిస్తున్నా­యి. బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడం ద్వారా ఇక్కడ ఫలితాన్ని వీరు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 

రామగుండం  గండం దాటేదెవరు?  
ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్‌పై గెలిచిన కోరుకంటి చందర్‌ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి పోటీలో ఉన్న ఈయనపై అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, ఆరోపణలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. నాలుగుసార్లు పోటీచేసి ఓడిపోయారనే సానుభూతి రాజ్‌ఠాకూర్‌ (కాంగ్రెస్‌)కు అనుకూలంగా మారొచ్చునంటున్నారు. కాంగ్రెస్‌ వేవ్‌ పనిచేస్తే గెలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీజేపీ తరఫున పోటీలో ఉన్న సంధ్యారాణి.. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నందున ఓటింగ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  

మానకొండూరు (ఎస్సీ)  గెలిచేదెవరు? 
ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి, డబు ల్‌ బెడ్‌రూం ఇళ్ల హామీని నామ్‌కే వాస్తే అమలు చేయడం, దళితబంధు, బీసీబంధు సరిగ్గా అమలుకాకపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్న రసమయి (బీఆర్‌ఎస్‌)పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. సత్యనారాయణ (కాంగ్రెస్‌) గతంలో పీఆర్‌పీ, టీడీపీ నుంచి మొత్తంగా మూ డుసార్లు పోటీ చేసి ఓడారు. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఆరేపల్లి మోహన్‌కు మంచిపేరే ఉన్నా.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి.. ఇప్పుడు బీజేపీలో చేరి పోటీలో నిలిచారు. 

వేములవాడ    ఎవరికో ‘రాజన్న’ అండ! 
సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం కేసు కారణంగా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించలేదు. గతంలో రమేశ్‌పై నాలుగుసార్లు పోటీచేసి ఓటమి పాలైన మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నా రు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు చెల్మడ లక్ష్మీ నరసింహారావు (బీఆర్‌ఎస్‌), మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కు మారుడు వికాస్‌రావు (బీజేపీ) ఇక్కడ పోటీలో ఉన్నారు.

బీసీ–కురుమ సామాజికవర్గానికి చెందిన తుల ఉమ (ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌)పేరును బీజేపీ ప్రకటించీ.. బీఫామ్‌ ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ సొంతగూడు బీఆర్‌ఎస్‌కు చేరుకున్నా రు. గతంలో నాలుగుసార్లు ఓడారనే సానుభూతి పనిచేస్తే ఆది శ్రీనివాస్‌ గెలిచే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈసారి ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. 

కరీంనగర్‌  పోటీ బరాబర్‌ 
కరీంనగర్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించి, మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరొందిన కమలాకర్, బీజేపీ ఎంపీగా, పార్టీ జాతీయ ప్ర ధానకార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ మధ్య  ద్విముఖ పోటీ నెలకొంది. మంత్రి అనుయా యులు, ద్వితీయ శ్రేణి నాయకుల పనితీరు, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరో­ప­ణల మధ్య, వరుసగా నాలుగోసారి కమలాకర్‌ విజయం సాధిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది.

ఇటీవల సంజ­య్‌ క్రమంగా పుంజుకుంటున్నారనే వాద న వినిపిస్తోంది. బీసీ సీఎం నినాదం, త్వరలోనే ఇక్కడ జరగబోయే మోదీ సభ, తదితరాలు ఆయనకు కలిసొచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముస్లిం ఓటింగ్‌ గణనీయంగా ఉ­న్నం­దు­న ఆ ఓట్లు కాంగ్రెస్‌కు పడితే పరిస్థితిలో మా­ర్పు వచ్చి సంజయ్‌కు అనుకూలంగా మారొచ్చునంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి పురుమల్ల శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు.

‘అభివృద్ధి’కే నా తొలి ఓటు..
అభివృద్ధి చేసే వారికి నా మొదటి ఓటు. రైతులతో పాటు నిరుద్యోగులకు అండగా ఉండే పార్టీకి ఓట్లేసి గెలిపించుకుంటాం. యు­వత ఓటింగ్‌తో రాష్ట్రంలో, దేశంలో మా ర్పు రావా­లి. డబ్బుకు మద్యానికి లొంగకుండా నిజాయితీగా ఓటు వేస్తాం.     – మీస మౌనిక, తిమ్మాపూర్, మానకొండూరు  

అందరికీ న్యాయమేది? 
ప్రస్తుత ప్రభుత్వంలో పలు లోటుపాట్లున్నా యి. తెలంగాణ సాధించుకున్నా..అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక అ­ల్లా­డిపోతున్నారు. కేవలం రైతుల సంక్షేమమే కాదు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి.     – పెద్ది మహేశ్వర్‌రెడ్డి, జగిత్యాల 

రైతులు హ్యాపీ 
కేసీఆర్‌ పాలన బాగుంది. నాకు రైతుబంధు తో పాటు, మా అమ్మకు వృద్ధాప్య పింఛన్‌ సకాలంలో వస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా రైతులకు మేలు చేయలే దు. ప్రస్తుత పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు.     –పెట్టం సాంబయ్య, మాణిక్యపూర్, హుస్నాబాద్‌ 


-ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కె.రాహుల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement