
సాక్షి,అమరావతి: పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ పనితీరుకు దర్పణం పట్టాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మంగళవారం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజలంతా మా నాయకుడు జగన్ వెంట ఉన్నారని మరోమారు స్పష్టం అయ్యింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత విజయం సాదించే దిశగా కృషి చేస్తున్నాం. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు గెలవలేక మాపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. మా సీఎం వైఎస్ జగన్ 30 లక్షల మందికి సొంతింటి కల సాకారం చేస్తున్నారు.
పట్టణాల్లో ప్రతి ఒక్క పేదవాడికి గూడు దొరికింది. ఒక్కొక్క ఇంటికి కనీసం 4 నుంచి 6 సంక్షేమ పథకాలు అందాయి. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు...మున్సిపల్ ఎన్నికల్లో మాకే పట్టం కడతారు. పోలీసులను ఉపయోగించి గెలిచామన్న చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధరహితం. ఆయనలా వ్యవస్థలను వాడుకోవడం మాకు చేతకాదు. ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై గౌరవం ఉంది. స్వయంగా ఎస్‌ఈసీనే ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని కితాబు ఇచ్చారు. ' అంటూ సుచరిత తెలిపారు.