టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని మీడియాకు చూపిస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత
పెదనందిపాడు (ప్రత్తిపాడు): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో ఈ నెల 20న వినాయక నిమజ్జన కార్యక్రమంలో పక్కా పథకం ప్రకారం వంద మంది టీడీపీ కార్యకర్తలు కాపు కాసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనలో గాయపడిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను గురువారం ఆమె పరామర్శించారు. మేదరమెట్ల వెంకటప్పయ్య చౌదరి, ఇంటూరి శ్రీకాంత్, ఇంటూరి హనుమంతరావుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. ఇతరత్రా బాధితులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దెబ్బలు తగిలిన వారితో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం చేసుకుంటున్న సమయంలో, మాజీ జెడ్పీటీసీ ఇంట్లో పక్కా పథకం ప్రకారం వంద మంది టీడీపీ శ్రేణులు కాపుకాసి వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టి, రాళ్లు వేసి ఘర్షణ వాతావరణం సృష్టించారన్నారు. ఇదేమని ప్రశ్నించిన హనుమంతరావుపై దాడికి పాల్పడ్డారని, అడిగేందుకు వెళ్లిన ఆయన కుమారుడు శ్రీకాంత్‌ను 20, 30 మంది కలిసి దాడి చేస్తూ.. ఇంట్లోకి లాక్కెళ్లారన్నారు. శ్రీకాంత్ స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో, చనిపోయారనుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కంగారు పడి తలుపులు పగలగొట్టి పోలీసుల సాయంతో బయటకు తీసుకువచ్చారని వివరించారు. ఇంత జరిగినా దెబ్బలు తిని గాయాలపాలైన వారిని ఓ వర్గం మీడియాలో చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాస్తవ పరిస్థితిని గమనించేందుకే కొప్పర్రుకు వచ్చానని తెలిపారు. హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే..
అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం
► పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నానని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండటం దారుణం. అదే నిజమైతే ఈ రెండున్నరేళ్లలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా?
► మా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంటే శాంతి కాముకులు. ఎక్కడా ఘర్షణలు జరగాలని మేం అనుకోవడం లేదు. మేము అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం.
► కొప్పర్రులో 2014లో జెడ్పీటీసీగా గెలుపొందిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే కొత్త సంస్కృతిని అలవాటు చేశారు. ఇంత మందిపై దాడి చేయడమే కాకుండా, వాళ్లపైనే బురద జల్లాలని అనుకోవడం దురదృష్టకరం.
► మా వాళ్ల మీదే దాడి చేసి, మా వాళ్ల మీదే తప్పుడు కేసులు పెట్టి.. అన్యాయంగా శిక్షలు ఖరారు చేయించాలన్న గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు వాస్తవాల మేరకు చర్యలు తీసుకుంటే హోం మినిస్టర్ బలవంతంగా మా వాళ్లపై కేసులు పెట్టించారని ఆరోపిస్తారు. అందుకే వాస్తవాలేమిటో బాహ్య ప్రపంచానికి చెబుతున్నాం.
► సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ కన్వీనర్ మదమంచి వాసు, కొప్పర్రు సర్పంచ్ సాతులూరి సురేష్, ఉప సర్పంచ్ ఏలూరి శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యుడు షేక్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment