మహిళల మానప్రాణాలతో చెలగాటమా? | Meruga Nagarjuna Comments On TDP Leaders | Sakshi
Sakshi News home page

మహిళల మానప్రాణాలతో చెలగాటమా?

Published Mon, Oct 3 2022 6:20 AM | Last Updated on Mon, Oct 3 2022 7:00 AM

Meruga Nagarjuna Comments On TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. వారికి కొమ్ముకాస్తున్న పచ్చ మీడియా వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్‌ సోషల్‌ మీడియా అరాచకవాది.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున ఆదివారం మీడియాతో మాట్లా డారు. ‘మహిళల మానప్రాణాలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయటం కరెక్టేనా? ఇంత సిగ్గుమాలిన పనులు చేసే వ్యక్తిని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు మా పార్టీ వాళ్లకు కూడా ఒళ్లు మండి అయ్యన్నపాత్రుడి కుటుంబంలోని మహిళలనో, నారా భువనేశ్వరినో, బ్రాహ్మణినో, లేకపోతే రామోజీరావు కోడలినో, మనవరాలినో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే వారికెలా ఉంటుంది? అప్పుడు కూడా... అలాంటి కామెంట్లు చేసిన వారిని ఈనాడు ఇలాగే సమర్థిస్తుందా?’ అని ప్రశ్నించారు.

సీఐడీ వారు విజయ్‌ కోసం వెళితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్థిస్తారా? ఐటీడీపీ అనే దానిలో ఈ విజయ్‌ దారుణమైన పోస్టులు పెట్టాడు. మహిళల శీలాన్ని అవమానించేలా,  ప్రజలు అసహ్యించుకునేలా విజయ్‌ పోస్టులు ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు. టీడీపీ అధికార వెబ్‌సైట్‌ ఐటీడీపీ ద్వారా పోస్టులు పెట్టారు.

అందుకే విచారణ కోసం పోలీసులు పిలిచారు. అదేమైనా తప్పా? ఇలాంటి వ్యక్తులను ఎల్లో మీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తోంది?. చింతకాయల విజయ్‌ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలను చంద్రబాబు, లోకేశ్‌ సమర్థిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? అని మంత్రి ప్రశ్నించారు. ‘దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు.

చింతకాయల విజయ్‌ కంటే ఎక్కువగా మేం మాట్లాడతాం. తిడతాం. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయడం లేదు. టీడీపీ వారికి సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్‌ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుం టుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పు డు మాటలు మాట్లాడటం సరికాదు’ అని అన్నారు.

మాకు విచక్షణ ఉంది ... 
చంద్రబాబు భార్య మీద, కోడలి మీద, రామోజీరావు భార్య మీద, కోడలి మీద, మనవరాళ్ల మీద  రాధాకృష్ణ కూతురు మీద.. ఇలా వారి ఇళ్లలో ఉన్న మహిళల మీద ఏనాడూ తాము ఇటువంటి విమర్శలకు దిగడం లేదని మంత్రి స్పష్టంచేశారు. ‘మా పార్టీ ప్రజలకు చేసిన మంచిని, మేలును నమ్ముకున్న పార్టీనే తప్ప దిగజారుడు ప్రచారాన్ని నమ్ముకోలేదు.

ఇంత నిగ్రహంగా మా నాయకత్వం, మేము ఉన్నా ఎవరో ఒకరు సహనం కోల్పోయి ప్రతిస్పందనగా పోస్టింగ్‌ పెడితే, నానా యాగీ చేస్తున్నారు. చింతకాయల విజయ్‌కు నోటీసు ఇస్తే, ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్లు తిట్టారు.  మేమూ తిట్టగలం. కానీ మాకు సంస్కారం ఉంది. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. విజయ్‌ శిక్షార్హుడు’ అని అన్నారు. టీడీపీ నేతలకు నిజంగా సిగ్గు ఉంటే చింతకాయల విజయ్‌ను సమర్థించకూడదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement