
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సామాజిక విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ఓర్వలేక.. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తున్నారన్న దుగ్ధతో.. దుష్ట చతుష్టయం గురివింద గింజల్లా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నాలుగు రోజులుగా వీడియోలంటూ గందరగోళం సృష్టిస్తున్న వారి నిజ స్వరూపం అనంతపురం ఎస్పీ ప్రకటనతో బట్టబయలు అయిందని తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యాలయమే మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలకు కేంద్రంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అది ఫేక్ వీడియో అని తేలిపోయిందని, దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే టీడీపీ ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పారు. ఇది మార్ఫింగ్ వీడియో అని తొలి రోజే ఎంపీ మాధవ్ చెప్పారన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
విదేశాల నుంచి కుట్రలు
► ఎల్లో విష నాగులు ప్రపంచమంతా విస్తరించాయి. ఎంపీ మాధవ్ పేరుతో ఆ వీడియో యూకే నుంచి టీడీపీ సోషల్ మీడియా ద్వారా విడుదలైంది. దుష్టచతుష్టయం విదేశాల నుంచి కూడా కుట్రలు చేస్తోంది. బాబు బతుకంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు.
► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. ఎస్సీలు, బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నారు. ఎస్టీ, మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు చేలో మేస్తే.. ఆయన పుత్ర రత్నం, ఆ పార్టీ నాయకులు గట్టున మేస్తారా?
► అసలు లోకేశ్ గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది. అతను మహిళల పట్ల ప్రవర్తించే తీరేంటో చూడండి. (లోకేశ్ పలువురు మహిళలలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు చూపుతూ..) అశ్లీలతకు, మహిళలను కించ పరచటంలో తెలుగుదేశం పార్టీ పేటెంట్ పొందింది. ఓటుకు కోట్లు, కాల్‌మనీ సెక్స్ రాకెట్లు.. టీడీపీకి మాత్రమే సొంతమైన వ్యవహారాలు. ఇదే బాబు ఏడేళ్ల క్రితం ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.
► సీఎం జగన్ ఈ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మహిళా పక్షపాతిగా, దళిత బహుజన బాంధవుడుగా పరిపాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ ప్రజాదరణ ఇలానే సాగితే.. తాము అధికారంలోకి రావడం కల్ల అన్న కలవరంతోనే టీడీపీ నేతలు గుడ్డ కాల్చి మా మొహాన వేస్తున్నారు.
► ఈ సంస్కృతి ఇలాగే కొనసాగిస్తే.. తస్మాత్ జాగ్రత్త. విష నాగులు ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తాం. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment