మూసీ పేరిట కాంగ్రెస్‌ భారీ దోపిడీ ప్లాన్‌: బండి సంజయ్‌ | Union Minister Bandi Sanjay Allegations On Congress Govt Over Musi Project | Sakshi
Sakshi News home page

మూసీ పేరిట కాంగ్రెస్‌ భారీ దోపిడీ ప్లాన్‌: బండి సంజయ్‌

Published Thu, Oct 24 2024 11:19 AM | Last Updated on Thu, Oct 24 2024 11:33 AM

Union Minister Bandi Sanjay Allegations On Congress Govt Over Musi Project

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్‌ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన  రేపు(శుక్రవారం)  ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు,  ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

..మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్‌కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైంది

సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement