సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ చదువులపై యెల్లో మీడియా అక్కసు ప్రదర్శించింది. ట్యాబ్‌ల వల్ల పిల్లలు తప్పుదోవ పడుతున్నారని.. చదువులు గాడి తప్పుతున్నాయంటూ కథనం ప్రచురించింది. దీనిని తీవ్రంగా పరిగణించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పేద పిల్లల భవిష్యత్‌పై ఈ పిచ్చారాతలేంటని?.. ఈనాడు, ఆ పత్రిక అధినేత రామోజీరావుపై తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు మంత్రి బొత్స.
గురువారం విజయవాడలో మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో దురదృష్టకర వాతావరణం ఏర్పడింది. ట్యాబ్‌లపై ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. విద్యారంగంలో ఎక్కడా ట్యాబ్‌లు ఉపయోగించడం లేదా?. ట్యాబ్‌లు ఇవ్వొద్దని ఏ పేరెంట్స్ కోరారు?.. ఇవన్నింటికి ఈనాడు సమాధానం చెప్పాలి. రామోజీరావు కొడుకు, మనవడు ట్యాబ్‌లు కంప్యూటర్లు, ట్యాబ్‌లు ఉపయోగించాలి కానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా? అని ప్రశ్నించారు మంత్సి బొత్స.
ఒక్క రూపాయి ఖర్చుకాలేదు
అవి బైజూస్ ట్యాబ్‌లు కావు. కేవలం బైజూస్ కంటెంట్ అందులో అప్‌లోడ్ చేసి ఇచ్చాం. అదీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాం. ఈ కంటెంట్ కోసం బైజూస్‌కి ప్రభుత్వం ఒక్కరూపాయి చెల్లించలేదు. అలాంటప్పుడు అవినీతి జరిగింది అని ఎలా ఆరోపిస్తారు?. ట్యాబ్‌ల కోసం ఖర్చంతా ప్రభుత్వమే భరించింది. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన వాటా చాలా తక్కువే అని బొత్స చెప్పారు.
వేరే కంటెంట్ రాదు
ట్యాబ్‌ల్లో ఎడ్యుకేషన్ కంటెంట్ కాకుండా మరేవి రాకుండా లాకింగ్ సిస్టమ్‌ఉంది. ట్యాబ్ లు ఎన్ని గంటలు వాడుతున్నారో కూడా తెలుస్తుంది ఎక్కడైనా గేమ్స్ ఆడాలని.. వీడియోలు చూడాలని ప్రయత్నించినా కూడా పేరెంట్స్‌కి సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశాం.
కనీస అవగాహన లేదా?
పేదవాడి పిల్లల భవిష్యత్తుపై ఇలా తప్పుడు వార్తలు రాసే బదులు ఈనాడు నుంచి ఉద్యోగం మానివేయడం మంచిదని రామోజీరావుకు పరోక్షంగా సూచించారు మంత్రి బొత్స. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయద్దని హితవు పలికిన మంత్రి బొత్స.. ట్యాబ్ లే ఇవ్వొద్దని ఎలా రాస్తారని, పేదపిల్లలకు అన్యాయం చేయమంటారా? అని ప్రశ్నించారు.
ఇలాంటి పనికిమాలిన వార్తలు మళ్లీ రాయొద్దు. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయద్దు. అసలు ప్రభుత్వ విధానాలపై కనీస అవగాహన, అధ్యయనం చేయకుండా తప్పుడు విమర్శలు ఎలా చేస్తారన్నారు. అమ్మ ఒడికి, విద్యా కానుకకి కూడా తేడా తెలియదని.. విమర్శలు చేసే ముందు కనీస అవగాహన అలవర్చుకోవాలని ఈనాడు-రామోజీలకు మంత్రి బొత్స చురకలటించారు .
పాజిటివ్‌ఓటుతో అధికారంలోకి వస్తాం
సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకీ మేలు చేసింది, వందకు 80 శాతం ప్రజలు ప్రభుత్వం వెంటే ఉంటారన్న నమ్మకం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పు పరిణామాలపైనా ఆయన స్పందించారు.
‘‘గత ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేశారుకాబట్టే చంద్రబాబు ఓడిపోయారు. జగన్ హయాంలో సంతృప్తికర పాలన సాగింది. విద్య, వైద్య రంగాలలో ఎంతో అభివృద్ది చేశాం. అంచెలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్నాం.. అదే చేస్తున్నాం. అందుకే పాజిటివ్ ఓటుతో మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారాయన
‘‘మంచి ఫలితాల కోసమే అభ్యర్ధులని మార్చాం. మా పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గాజువాక, మంగళగిరిలలో బీసీలకే కదా ఇచ్చాం. టిక్కెట్ల కేటాయింపులో మా స్టైల్ మాది.. మా విధానం మాది. చంద్రబాబుకి కుప్పం సీటుపైనే గ్యారంటీ లేదు. అసలు చంద్రబాబు రెండు చోట్ల ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు?’’..
►పదిహేను మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ చెప్పడం పెద్ద జోక్. మూడు నెలలు తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు. ఉగాది తర్వాత ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ విషయం నేను ఆరు నెలల క్రితమే చెప్పా..
►.. గత ప్రభుత్వంలో అంగన్‌వాడీల జీతాలు పెరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పెంచాం. సమస్యలు ఏమున్నా.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అంగన్ వాడీలు ఆందోళన విరమించాలని కోరుకుంటున్నాం..
►తుపాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుంది. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు.. అని మంత్రి బొత్స మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment