సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబును రాముడితో పోలుస్తారా అంటూ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నలభై ఏళ్ల ఉత్సవాలంటూ టీడీపీ హడావుడి చేస్తోంది. ఎన్టీఆర్ చైతన్య రథం ఏ పరిస్థితిలో బూజు పట్టి ఉందో టీడీపీ కూడా అలాగే ఉంది. చంద్రబాబుకు సమిష్టి అభివృద్ధి అన్న ఆలోచన పోయిందని.. విశాల దృక్పథం కరువైందని’’ అన్నారు.
చదవండి: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
‘‘చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలు వదిలేసి కొత్త సిద్ధాంతాలు తెచ్చాడు. చంద్రబాబుకి రాముడు అనే మాట ఎలా సరిపోద్దో చెప్పండి. సొంత మామకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్డు అని మళ్లీ అదే పాట అందుకున్నాడు.. అవి కట్టింది వైఎస్సార్. వైఎస్సార్ జలయజ్ఞం ప్రవేశపెట్టింది అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి చంద్రబాబు ప్రాజెక్టులపై డాంబికాలు చెప్పుకుంటున్నాడు. అవన్నీ చేస్తే నీ కొడుకు నీ ఇంటి పక్కనే ఎందుకు ఓడిపోయాడు’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
‘‘వైఎస్సార్ విధానాలను వైఎస్ జగన్ మళ్లీ అమలు చేస్తున్నారు. చంద్రబాబు చేసింది.. అమరావతి భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఇక టీడీపీ జవసత్వాలు కోల్పోయింది. వారికి ఎటువంటి విధానాలు లేవు. మాకు ఒక విధానం ఉంది.. దాన్ని ప్రజలకు చెప్పి ఓటు అడిగాం. ఆ విధానాలనే మా నాయకుడు అమలు చేస్తున్నారు. పరిపాలనలో ఒక విప్లవం తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment