సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చి ఉంటే బాగుండేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు ఎవరి మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదని, గీతం వర్సిటీ ఆక్రమించినవి ప్రభుత్వ భూములు కాబట్టే అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘గీతం యూనివర్సిటీ అక్రమించుకున్న భూములు వెనక్కి తీసుకోకూడదా? చంద్రబాబు బంధువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా? ఈ భూముల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆరు నెలల క్రితం నుంచి గీతం భూములపై వివాదం నడుస్తోంది. ఆ భూముల విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం సరికాదు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గీతంకు భూములు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ భూములు దోచుకునేవారికి ఆయన వత్తాసు పలుకుతారా?’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ అంచనాలు కాంట్రాక్ట్ కోసం ఇష్టానుసారంగా తగ్గించారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని మంత్రి బొత్స స‍్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సాయం కోరతామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment