జనగామ రూరల్: ‘రానున్న కాలం బీఆర్‌ఎస్‌దే. వచ్చే ఐదారు నెలల్లోనే బీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ పోటీచేసినా ప్రజలు గుర్తించి ఓట్లు వేస్తారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. బట్టేబాజ్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారే తప్ప కష్టపడలేదు. కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పారని, ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. పాలనాపరంగా అవగాహన లేక కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, జూటా మాటలతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. వీరిలో వ్యంగం తప్ప వ్యవహారం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మొదటి డిక్లరేషన్‌గా చెప్పిన ముఖ్యమంత్రి నేడు మాట మార్చారని ఆరోపించారు. సోనియా గాంధీ పుట్టిన రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు ఆ ఊసే లేదన్నారు.
పంట కొనుగోలులో అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ఏదైనా అవసరం ఉంటే సరిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలే తప్ప రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, బీఆర్‌ఎస్‌కు ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి దయాకర్‌రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment