సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న కేంద్రం, ఇప్పుడు గ్రామీణ పేద కూలీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నంలో ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం గతనెల 18న సర్క్యులర్ జారీ చేసిందని, దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పథకాన్ని అవినీతి పేరుతో రద్దు చేసే కుట్రలను విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....
రూ.10వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో..
కేంద్రం కుట్ర వల్ల దేశంలోని కూలీలకు, తెలంగాణలోని 1.21 కోట్ల మంది ఉపాధి హామీ కూలీల హక్కులకు భంగం కలుగబోతోంది. దేశవ్యాప్తంగా రూ. 10వేల కోట్ల వేతనాలు పెండింగ్ ఉన్నాయని స్వయాన కేంద్ర మంత్రి ఇటీవల రాజ్యసభలో చెప్పారు. 2022–23 కేంద్ర బడ్జెట్లో ఉపాధి హమీ పథకానికి రూ. 73 వేల కోట్లే కేటాయించారు. ఇందులో 18,380 కోట్లు గతేడాది బకాయి వేతనాలకే పోగా, మిగిలిన నిధులు ఏ మూలకు సరిపోతాయి.
8 గంటలు పనిచేస్తే.. రూ. 257 ఇస్తారా?
కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌లో కూలీలు ఉదయం 10లోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకోసారి ఫోటోలు దిగి అప్‌లోడ్ చేయాలని ఉంది. ఎండాకాలంలో 8 గంటలు పని చేయడం ఎలా సాధ్యం? ఉదయం, సాయంత్రం హాజరు తప్పనిసరి చేయడం కూలీలను అవమానించడమే. రూ.257తో నిజంగా జీవనోపాధి లభిస్తుందా? 17 ఏళ్ల నుంచి పథకం అమలవుతుంటే... కొత్త బ్యాంకు అకౌంట్లు తీయాలని కూలీలను వేధిస్తూ వేతనాలు చెల్లించడంలో కేంద్రం ఆలస్యం చేస్తోంది. కూలీలు తమ శ్రమతో దేశ సంపద పెంచుతుంటే, ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలి.
బీజేపీ ప్రతినిధులకు అధికారం కోసమే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన ఫస్ట్ రన్నరప్‌ను ఈ పర్యవేక్షణలో భాగం చేయాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రన్నరప్ అనే పదాన్ని వాడడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. అధికారుల పనిని ఎన్నికల్లో ఓడిన వారికి అప్పగించడంలో మతలబేంటి? ఓడిన మీ పార్టీ ప్రతినిధులకు అధికారం కట్టబెట్టేందుకే ఈ నిర్ణయమని అర్థమవుతోంది.
ఉపాధి హామీ ద్వారా ఒక గ్రామంలో 20 పనులే చేపట్టాలని కేంద్రం చెప్తోంది. దీనివల్ల కూలీలకు పనులు ఎంపిక చేసుకునే అవకాశం సన్నగిల్లి, ఉపాధికి దూరమవుతారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ బిడ్డగా మీరెలా సమర్థిస్తారు?
Comments
Please login to add a commentAdd a comment