
సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి టి.హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం 201 ఎకరాల భూమిని ఇప్పటికే అప్పగించిందన్నారు. ఆ వివరాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో పాక్షికంగా మాత్రమే నిర్మాణం జరిగిందని, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రిని వినియోగంలోకి తెచ్చిందన్నారు.
ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలను ప్రారంభించిందని వివరించారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేంద్రం లేఖ రాసిందని వెల్లడించారు. దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వారం రోజుల్లో టీఓఆర్ ఇచ్చేలా కృషి చేశామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా భూమిని అప్పగించాలి అని కిషన్‌రెడ్డి అనడం విస్మయం కలిగిస్తోందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎయిమ్స్ విస్తరణ ఇబ్బందికరంగా మారిందనడం పచ్చి అబద్ధమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూమిని అప్పజెప్పడంతో పాటు, అన్ని రకాల అనుమతులను అడిగిన వెంటనే మంజూరు చేసిందన్నారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏడేళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment