కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మోసపోతారు | Minister Harish Rao in Narsapur election assembly | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మోసపోతారు

Published Mon, Oct 30 2023 3:34 AM | Last Updated on Mon, Oct 30 2023 3:34 AM

Minister Harish Rao in Narsapur election assembly - Sakshi

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మి ఓటేస్తే మోసపోతారని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో రోజుకు ఐదు గంటలే విద్యుత్‌ ఇస్తున్నామని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. శివకుమార్‌ వాస్తవాన్ని చెప్పారంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

మన రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం గోసపడిన రోజులు మళ్లీ వస్తాయని ప్రజలను హెచ్చరించారు. డీకే శివకుమార్‌ మాటలను రాష్ట్రంలోని రైతులు అర్థం చేసుకుని కాంగ్రెస్‌ను తెలంగాణలో సమాధి చేయాలని హరీశ్‌రావు హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టాలతో బతికామని, ఇప్పుడిప్పుడే మన బతుకులు ఒక స్థాయిలో బాగు పడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే మన బతుకులు మరింత బాగు పడతాయని అన్నారు.

కాగా, రైతుబంధు కింద ఆర్థిక సహాయం ఆపాలని కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని మంత్రి ఆరోపించారు. యాసంగికి రైతుబంధు కావాలా.. వద్దా? అని రైతులను ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, అలాంటి వారికి ఓటెయ్యవద్దని చెప్పారు. ఈ సభలో నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎన్నికల ఇన్‌చార్జి వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement