సోమిరెడ్డికి మంత్రి కాకాణి సవాల్
కారు స్టిక్కర్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
బెంగళూరు రేవ్ పార్టితో సంబంధమే లేదు
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.
ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్‌పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్‌రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్‌రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.
క్లబ్‌కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment